అష్టదిగ్బంధంలో కోనసీమ.. అధారాలు సేకరిస్తున్న పోలీసులు
కోనసీమ జిల్లాలోని అమలాపురం వ్యాప్తంగా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో కర్ఫ్యూ వింధించిన పోలీసులు.. ఎలాంటి ఆందోళనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నిన్న అమలాపురంలో జరిగిన ఘటనపై సీరియస్ అయిన పోలీస్ యంత్రాంగం స్పెషల్ టీంను నియమించింది. ఆందోళనకారులను గుర్తించే పనిలో పడ్డ పోలీస్ బృందం.. సీసీ పుటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలక్టరేట్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో జరిగిన అన్ని ఘటనల్లో ఒకే టీం పాల్గొందని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే, మంత్రి ఇళ్లపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరిన వారిని గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు.. వారిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశామన్నారు. మరోవైపు అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. దీంతో పాటు ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.