Kommineni Srinivasa Rao Appointed as Ap Press Academy Chairman : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి కొత్త ఛైర్మన్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు నియమించింది. నిజానికి ఈ నెల 7వ తేదీతో ప్రస్తుత ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావును నియమించారు. ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనాథ్ రెడ్డిని 2019లో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించారు. దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పదవీ కాలం గత ఏడాదితోనే ముగిసినా ప్రభుత్వం ఓ ఏడాది పొడిగించింది. 2021 నవంబరు 7తో ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి మరో ఏడాదిపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు మరో ఏడాది పాటూ శ్రీనాథ్ రెడ్డి పదవిలో కొనసాగారు. తాజాగా ఈ ఏడాది నవంబరు 7తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం నవంబర్ 3వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు 1978 నుంచి జర్నలిస్ట్ గా ఉన్నారు. ఈనాడులో వివిధ హోదాల్లో దాదాపు 24 సంవత్సరాల పాటు పని చేసిన ఆయన 2002లో ఆంధ్రజ్యోతి పునఃప్రారంభం అయినపుడు బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. 2007 నుంచి ఎన్టీవీ ఛానల్‌లో దాదాపు ఎనిమిదేళ్ల పాటు పని చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఎన్టీవీ నుంచి బయటకు వచ్చి ‘సాక్షి’ ఛానల్‌లో చేరారు. ప్రస్తుతం కొమ్మినేని సాక్షి టీవీలో ఎర్లీ మార్నింగ్ వచ్చే పొలిటికల్ డిబేట్లకు హోస్ట్ గా వ్యవరిస్తున్నారు.