Kesineni Nani: వాళ్ళకి టికెట్లు ఇస్తే నా మద్దతు ఇవ్వను.. కేశినేని కీలక వ్యాఖ్యలు!
Kesineni Nani Crucial Comments: తెలుగుదేశం నేత విజయవాడ ఎంపీ కేసినేని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలంటే పార్టీలో ప్రక్షాళన జరగాలని చీటర్లు, రియల్ ఎస్టేట్ మోసాలు చేసిన వారు, కాల్ మనీ గాళ్ళకు ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ ఇవ్వకూడదని అన్నారు. తన తమ్ముడు చిన్ని సహా మరో ముగ్గురికి టికెట్ ఇస్తానంటే వారికి తన మద్దతు ఇవ్వలేనని ఆయన తేల్చి చెప్పారు. తనకంటే తన తమ్ముడు చిన్ని పార్టీలో యాక్టివ్ గా ఉంటే మంచిదని పేర్కొన్న నాని ల్యాండ్ గ్రాబర్స్, ఉమనైజర్లకు సీటు ఇచ్చి టిడిపి సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ స్థాయి నాయకుడిని అని పేర్కొన్న కేసినేని నాని తన సేవలు కావాలంటే పార్టీ వాడుకోవచ్చని అన్నారు. ఇక పార్టీ మంచి క్యారెక్టర్ ఉన్నవాడికి టికెట్ ఇస్తే ఎంపీని చేస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. తాను ఎంపీ అయితేనే ఈ స్థాయి రాలేదని తనకు ముందే ఒక బ్రాండ్ ఉందని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయాలతో స్థాపించిన టిడిపిలో ఎవరికి పెడితే వారికి టిక్కెట్లు ఇచ్చి పార్టీ సిద్ధాంతాన్ని చెడగొట్టవద్దని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికీ కొంతకాలంగా బుద్ధా వెంకన్న అలాగే కేశినేని చిన్ని వంటి వారితో కేశినేని నానికి పోసగడం లేదు వీరు పలు సందర్భాల్లో బహిరంగంగానే ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇప్పుడు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.