ఏపీ యువకుడిని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు
కేరళకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని పెరుంబవూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన ధర్మ తేజ (21)గా గుర్తించారు. కేరళకు గంజాయి రవాణా చేస్తున్న రాకెట్‌లో ఇతను కీలక సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. గత అక్టోబర్‌లో కున్నువాజిలోని ఓ కొరియర్ కంపెనీ ద్వారా 30 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాకు తేజ ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని డెలివరీ చేశాడు. ఈ కేసుకు సంబంధించి జిల్లా పోలీసు చీఫ్ కె.కార్తీక్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తొమ్మిది మందిని అరెస్టు చేసింది. ఈ విచారణలో భాగంగా తేజను అరెస్టు చేశారు. కొరియర్ ద్వారా గంజాయిని పంపిన గోకుల్‌కు విశాఖపట్నం జైలులో ఉన్న సమయంలో తేజతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ వేర్వేరు కేసుల్లో జైలు పాలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గోకుల్ గంజాయి వ్యాపారంలో తేజ భాగస్వామి అయ్యాడు. వీరు పలుమార్లు కేరళకు గంజాయిని స్మగ్లింగ్ చేసినట్లు సమాచారం. తేజ తండ్రి, సోదరుడు పలు దొంగతనాలు, గంజాయి కేసుల్లో పట్టుబడ్డారు. ఆంధ్రాలోని కాకినాడ తీర ప్రాంతానికి చెందిన తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.