KCR Vs CBN: చంద్రబాబును వదలని కేసీఆర్.. కొత్తస్కెచ్..!
KCR new strategy againstTDP JAnasena Alliance in Andhra Pradesh Politics: బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చంద్రబాబును వదల బొమ్మాళీ వదల అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను టీడీపీలో ఉండగా.. చంద్రబాబునాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి.. ప్రత్యేక రాష్ట్ర ఎజెండా ఎత్తుకున్న కేసీఆర్ దానిని విజయవంతంగా సాధించారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక అధికారాన్ని చేపట్టి.. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని పంతం పట్టారు. తొలుత ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబును భయపెట్టి.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోయేలా చేసిన గులాబీ బాస్ ఆ తరువాత టీడీపీని భూస్థాపితం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పార్టీ నేతలందరినీ తన పార్టీలో చేర్చుకుని సైకిల్ రెండు టైర్లూ కదలకుండా చేశారు. తిరిగి 2018 ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టి తనను ఓడించేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టారు.
ఆ వెంటనే ఏపీలో వైఎస్ జగన్‌కు పరోక్ష సహకారం అందించడం ద్వారా చంద్రబాబును అధికారానికి దూరం చేసి.. కోలుకోలేని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. చంద్రబాబుపై కేసీఆర్ ఆగ్రహం అంతటితో ముగిసిందని అందరూ భావిస్తుండగా.. ఇప్పుడు మళ్లీ దెబ్బ తీసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీలో వైసీపీని గద్దె దించేందుకు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు సిద్ధపడుతుండగా.. జనసేనకు ప్రధాన ఓటుబ్యాంకుగా భావిస్తున్న కాపు సామాజికవర్గంలో చీలిక తెచ్చి వీరి కూటమిని బలహీనపరిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కాపు కులానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను తన బీఆర్ ఎస్ కు ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించారు. చంద్రశేఖర్ నేత్రుత్వంలో కాపు నేతలను తనవైపు తిప్పుకొనేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కాపు నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని సంకేతాలను ఆ సామాజికవర్గ ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆదివారం (ఈనెల 22వ తేదీన) పలువురు కాపు ప్రముఖులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. తోట చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ నేత కన్నా లక్షీ్నారాయణతోపాటు చాలా మంది నేతలు హాజరయ్యరు.
ఈ సందర్భంగా.. కాపులు ఏ పార్టీలో ఉన్నా ప్రాధాన్యం దక్కించుకోవాలని నేతల భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే పైకి ఇలా చెబుతున్నా.. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో తనకు బాగా సన్నిహితులుగా ఉన్న కాపు ప్రముఖులు, ద్వితీయ శ్రేణి నేతలతో తోట చంద్రశేఖర్ టచ్‌లో ఉన్నారు. వీరిలో కూడా జనసేనలో యాక్టివ్‌గా ఉన్న వారిపైనే దృష్టి పెట్టారు.బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులయ్యేవరకు తోట.. జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి.. ఏపీలోని అన్నీ జిల్లాల్లోని కాపు నేతలతో ఆయనకు సంబంధాలున్నాయి. దీంతో వారందరినీ బీఆర్ ఎస్ లోకి రప్పించేందుకు ప్రయతి్నస్తునారు. ఈ విషయంలో చంద్రశేఖర్ విజయవంతమైతే..చంద్రబాబు పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నా అధికారం దక్కించుకోవడం కష్టమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేసీఆర్ ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి కారణం చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేయడమేనని అంటున్నారు. తెలంగాణలో తనను ఇబ్బంది పెడుతున్నబీజేపీని ఈ రూపంలో దెబ్బతీయాలన్నది కేసీఆర్ వ్యూహంగా పేర్కొంటున్నారు.