Kapu Sankshema Sena: టీడీపీ-జనసేన పొత్తు ఉండాలి.. పవన్ సీఎం అవ్వాలి!
Kapu Sankshema Sena Letter: కాపు సంక్షేమ సేన తరపున మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య లేఖ విడుదల చేశారు. వైసీపీని ఓడించాలంటే టీడీపీ-జనసేన పొత్తు ఉండాల్సిందేనని అయితే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలని తన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. పవన్ ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని ఓడించాలంటే తెలుగుదేశం – జనసేన పొత్తు ఉండవలసిందే-ఇదే కాపు సంక్షేమ సేన ఆకాంక్ష అని, అయితే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండవలసిందే, ఇది కాపు సంక్షేమ సేన డిమాండ్ అని లేఖలో పేర్కొన్నారు.
కాపు సంక్షేమ సేన ఆవిర్భవించిందే రెండు ఆశయాలను నెరవేర్చుట కొరకు అని అవే విద్యా, ఉద్యోగాలలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు ప్రస్తుతం బిసిలుగా ఉన్న సామాజికవర్గాలకు ఎటువంటి నష్టం . కలగకుండా రిజర్వేషన్స్ దక్కించుకొనుటకని అన్నారు. అలాగే రాష్ట్ర జనాభాలో 22 శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలనేది మరో ఆశయం అని అన్నారు. అంటే ముఖ్యమంత్రి కాపులకు దక్కాలని అన్నారు. ఇక విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ దక్కించుకోవడమే ధ్యేయంగా అనేక ఉద్యమాలు, దీక్షలు చేస్తూ వస్తోంది కాపు సంక్షేమ సేన, ఈ విషయంలో త్వరలో న్యాయస్థానం తలుపులు తట్టబోతుందని అన్నారు. ఈ డిమాండ్ సాధించుకొనుటకు కాపు కులస్తులను ఎవరికీ తాకట్టు పెట్టకూడదనేదే కాపు సంక్షేమ సేన విధి విధానాలని పేర్కొన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయటమే కాపు సంక్షేమ సేన అల్టిమేట్ ఎయిమ్ అని పేర్కొన్న ఆయన రాక్షస పరిపాలన, అభివృద్ధి రహిత పరిపాలన, అవినీతి పరిపాలన సాగిస్తున్న వైఎస్ఆర్ పార్టీ అధినేతను రాబోయే ఎన్నికల్లో ఓడించటం మాత్రమే కాదు పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల రాజ్యం ఏర్పాటు చేయడమే కాపు సంక్షేమ సేన ముఖ్య ఆశయమని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ రెండవ ఆశయ సాధనకు బడుగు బలహీనవర్గాలవారందరూ కలిసి జనసేనతో పనిచేయాలని అవినీతిరహిత పరిపాలనకు దోహదం చేయాలంటే సరికొత్త పరిపాలన కోరుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.