Mudragada: సీఎం జగన్ కు ముద్రగడ లేఖాస్త్రం
Kapu leader Mudragada Padmanabham letter to CM Jagan
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి సీఎం జగన్ కు లేఖ రాశారు. కాపు,తెలగ,బలిజ, ఒంటరి కులస్థులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కాపు,తెలగ,బలిజ, ఒంటరి కులస్థుల రిజర్వేషన్ల కోసం ఎందరో పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న విషయాన్ని సీఎంకు గుర్తుచేశారు. పోరాటాలకు ముగింపు పలికే విధంగా మీ చర్యలు ఉండాలని కోరుకుంటున్నాని ముద్రగడ తన లేఖలో తెలిపారు. రైలు, బస్సు వెళ్లిపోయిన తర్వాత ప్రయాణికులు వెళ్లినట్లుగా మీ నిర్ణయం ఉండకూడదని ముద్రగడ సీఎం జగన్ ను కోరారు.
కాపు, తెలగ, బలిజ, వంటరి కులాలకు చెందిన ప్రజలను అనేక పార్టీల వారు వాడుకుని వదిలేస్తున్నారని ముద్రగడ తన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇంచుమించు అన్ని పార్టీల వారు అదే విధంగా వాడుకుని వదిలేస్తున్నారని సీఎం జగన్ కు తెలిపారు. నది దాటిన తర్వాత పడవను తగులబెట్టిన చందంగా అన్ని పార్టీలు వ్యవహరించాయని, మీరు అలా చేయవద్దని సీఎం జగన్ ను ముద్రగడ కోరారు.
కాపుల కోరిక సమంజసమని మీరు చాలా సందర్భాల్లో అన్నట్లు తాను విన్నానని ముద్రగడ సీఎంకు తెలిపారు. సాక్షి టీవీలోను, అసెంబ్లీలోను కాపుల రిజర్వేషన్ అంశానికి మీరు పూర్తి మద్దతు తెలిపారని, చాలా మంది కాపు నాయకుల కన్నా మీరు మంచిగా ఆలోచిస్తున్నారని విన్నానని ముద్రగడ వివరించారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయమని మరోసారి కోరుతున్నానని ముద్రగడ సీఎం జగన్ ను కోరారు.