ఆ ఎమ్మెల్యేతో మంత్రి కాకాణి కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు చాలా మంది ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే అసంతృప్తిగా ఉన్నవారిని ఇప్పుడు బుజ్జగిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ప్రసన్న కుమార్‌రెడ్డిని కలిసిన ఆయన.. పలు అంశాలపై చర్చించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి పదవి దక్కించుకున్న తర్వాత తొలిసారి నెల్లూరుకు వచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డికి జిల్లా వైసీపీ శ్రేణులు..ఘన స్వాగతం పలకగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనతో సమావేశమై చర్చించారు కాకాణి. కాగా, కేబినెట్ విస్తరణ తర్వాత నెల్లూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టగా జగన్ మాజీ మంత్రి అనిల్, ప్రస్తుత మంత్రి కాకాణిని పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు.