KA Paul: జీవో నెం.1పై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు.. మూడేళ్ల క్రితమే రావాల్సిందా?
KA Paul on GO No.1: ఏపీలో వైసీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు జీవో నెంబర్ 1 మీద వ్యతిరేకంగా ఉన్నా ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఏ.పాల్ మాత్రం దానికి మద్దతు పలుకుతూ వస్తున్నారు. తాజాగా అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన జీఓ నెంబర్ 1 తీసుకుని రావడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. అసలు సందుల్లో మీటింగ్ లో ఎలా పెడతారు? అలా ఒకవేళ వైసీపీ నేతలు పెట్టినా అడ్డుకుంటానని అన్నాడు. జీఓ నెంబర్ 1ను సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టిన పాల్ అది ప్రాణాలు కాపాడే జీఓ అని అన్నారు. జీఓ సస్పెండ్ చేసింది న్యాయమూర్తి అయినా సరే తప్పుబడుతున్నానని పేర్కొన్న ఆయన ఈ జీఓ మూడేళ్ల క్రితమే రావాల్సింది.. ఆలస్యమైందని అన్నారు. తనకు ఛాన్స్ ఇస్తే 6 నెలల్లో అప్పులు తీర్చి, లక్ష ఉద్యోగాలు తెస్తానని అంత వరకు నా పాస్ పోర్ట్, గ్రీన్ కార్డ్ కోర్టుకు సబ్మిట్ చేస్తానని అన్నారు.
సంక్రాంతి రోజు బాధతో మాట్లాడుతున్నానని పేర్కొన్న పాల్ వంద రూపాయలు లేక చాలా మంది బాధపడుతున్నారని, వెయ్యి రూపాయలు లేక సొంత ఊళ్లకు వెళ్లలేకపోతున్నారని అన్నారు. పండుగ వేళ కొత్త బట్టలు కొనేందుకు డబ్బులు లేని పరిస్థితి ఏపీ, తెలంగాణలో ఉందని ఆయన అన్నారు. ఇక కియా వచ్చినప్పుడు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఎక్కడిచ్చారు? అని ప్రశ్నించిన ఆయన 30 శాతం నిరుద్యోగ సమస్య పెరిగిందని అన్నారు. చంద్రబాబు, జగన్ లు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న పాల్ పవన్ కళ్యాణ్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని అందుకే జేడీ లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు జనసేన లోకి వెళ్లరని అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఓట్లు చీలుస్తున్నారు? పవన్ రాజకీయాల నుంచి తప్పుకో లేదా నా పార్టీలో అయినా చేరండని మరోసారి పిలుపునిచ్చారు.