Janasena: నాగబాబు లెక్కలు సరే.. అక్కడ తగ్గింది ఎవరికి?
Janasena Vote Share: ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కానీ రేపో మాపో ఎన్నికలు అన్నట్టుగా ఒక రేంజ్ లో ఎన్నికల సమరం మొదలైంది. అధికార – ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలు వస్తాయేమో అన్నట్టుగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. టీడీపీ – జనసేన పొత్తు గురించి ప్రకటించకపోయినా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధం అవుతుండగా ఖచ్చితంగా గెలుపు మాదే అంటూ ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అందరం గమనిస్తూనే ఉన్నాం. అయితే జనసేనకు సరైన ఓటింగ్ పర్సెంటేజ్ లేదని అనుకుంటుంటే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం జనసేన గ్రాఫ్ పెరిగిందని కొత్త లెక్కలు చెప్పారు. జనసేన బలం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోందని అంటూ నాగబాబు చెప్పిన లెక్కల పై విశ్లేషణలు మొదలయ్యాయి.
వైసీపీ అసలు రాజకీయ పార్టీనే కాదన్న ఆయన పొత్తులకు ఇంకా సమయం ఉందని చెబుతూనే జనసేన బలం ఏ స్థాయిలో పెరిగింది అనే వివరాలు చెప్పుకొచ్చారు. అదేమంటే 2019 ఎన్నికల్లో జనసేన బలం దాదాపు 7 శాతంగా ఉంటే అదిప్పుడు 24.5 శాతానికి పెరిగిందని నాగబాబు చెప్పుకొచ్చారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం ఈ నాలుగేళ్ల కాలంలో జనసేన బలం ఏకంగా మూడు రెట్లకు పైగా పెరిగినట్టు అయింది. అయితే జనసేనకు ఇప్పుడు 24.5 శాతం ఓట్ల శాతం ఉంటే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి ఏంటి ప్రశ్న వినిపిస్తోంది. అసలు లెక్కలలోకి వెళితే 2019 ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు రాగా, టీడీపీకి దాదాపు 40 శాతం ఓట్లు, జనసేనకు 7 శాతం అలాగే ఇతర పార్టీలకు 3 శాతం మేర వచ్చాయి. అయితే నాగబాబు చెబుతున్నట్లుగా 7 నుంచి 24.5 శాతానికి జనసేన బలం పెరిగితే ఎవరి షేర్ జనసేనకు బదిలీ అయింది అనే చర్చ మొదలయింది.
అయితే ఎన్నికల ముందు క్యాడర్ లో జోష్ నింపేందుకు చెప్పిన లెక్కలా.. లేక నిజంగా సర్వేల ఆధారంగా చేసిన విశ్లేషణా అనే అంశం మీద అసలు విషయం ఆధార పడి ఉంటుంది. టీడీపీ- జనసేన పొత్తు ఖాయమని అందరూ దాదాపుగా నిర్ణయానికి వచ్చారు కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేన ఎన్ని టికెట్లు డిమాండ్ చేస్తారు అనే అంశం మీద ఆధార పడి లెక్కలు ఉంటాయి. ఇక జనసేనాని తమకు గౌరవం దక్కితేనే పొత్తు ఉంటుందని చెబుతున్నా ఆ గౌరవం అంటే సీట్ల దగ్గర నుంచి అధికారం వరకు అన్ని అంశాలు కలగలిపి ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు నాగబాబు చెబుతున్నట్లుగా జనసేన గ్రాఫ్ 24.5 శాతానికి పెరిగితే పవన్ కు పొత్తు అవసరం లేదు కదా ఎందుకంటే ఆయన ఒంటరిగా పోటీ చేస్తే కింగ్ మేకర్ కావడం ఖాయం. కానీ పొత్తుల కోసం జనసేన కూడా ఆసక్తి చూపిస్తున్న క్రమంలో ఈ లెక్కలన్నీ ఒట్టిదే అంటున్నారు విశ్లేషకులు.