Janasena Tension: జనసేనతో పొత్తు..తెలుగు తమ్ముళ్ళలో టెన్షన్!
Janasena Tension to TDP: 2019లో విడివిడిగా పోటీ చేసిన తెలుగుదేశం, జనసేన, బిజెపి ఏవీ లాభ పడలేకపోయాయి. వైయస్ జగన్ అధికారంలోకి రావడంతో తరువాత తప్పు తెలుసుకున్న బిజెపి -జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకోగా 2024 ఎన్నికలకు వెళ్లే లోపు టీడీపీ- జనసేన పొత్తు పెట్టుకునే అంశం దాదాపు ఖరారు అయినట్లే. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి అనే కార్యక్రమంలో ఈ అంశం మీద చూచాయగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఛీల్చకుండా టిడిపితో పొత్తు పెట్టుకోబోతున్నట్లుగా ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఒంటరిగా పోటీ చేస్తే 2019లోకి 2024 ఎన్నికల్లో కూడా అదే ఫలితాలు వస్తాయని, ఒంటరిగా వీరమరణం పొందే కంటే పొత్తు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ముందుకు వెళ్లడం బెటర్ అన్నట్లే పవన్ మాట్లాడడంతో దాదాపుగా ఇక ఈ పొత్తుల వ్యవహారం ఖరారు అయినట్లే.
సీట్ల పంపకం కుదిరితే అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. ఒకవేళ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి గెలిస్తే తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పవన్ సహా ఆ పార్టీ నుంచి గెలిచిన కొందరు నేతలకు కీలక పదవులు తగ్గడం ఖాయమే. అయితే ముఖ్యమంత్రి స్థానాన్ని చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకుంటారనే ప్రచారం జరుగుతున్నా తెలుగుదేశం జనసేనలు దీనికి నిజంగానే తలొగ్గి ముందుకు వెళతాయా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు ఈ విషయంలో టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ప్రకటించిన చంద్రబాబు మిగతా నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను ప్రకటించారు. కానీ వారికే టికెట్లు అనే విషయం ఎక్కడా మాట్లాడడం లేదు. కొన్నిచోట్ల అయితే పనిచేసుకోండి త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు. ఇప్పుడు అలాంటి వారందరికీ టెన్షన్ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే జనసేన కూడా ఈసారి ఎక్కువ సీట్లు అడిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా 30 సీట్లు పైగా జనసేన కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి తెలుగుదేశం నుంచి తమకు పోటీ చేసే అవకాశం వస్తుందా లేదా అని కొందరు ఇన్చార్జిలు ఇప్పటికే టెన్షన్ పడడం మొదలుపెట్టారట. అయితే చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ కాబట్టి తమ సీటు తమ వరకు వస్తుందా లేదా అనే టెన్షన్లో వారందరూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏదేమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు టీడీపీ తో పొత్తు అంటే సోషల్ మీడియాలో విరుచుకుపడిన జనసేన కార్యకర్తలు సైతం ఈ విషయంలో ఇప్పుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు సైతం ఒకప్పటిలా జనసేన మీద విరుచుకు పడకుండా వారు కూడా సోదర భావంతో మెలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఈ జనసేన పొత్తు వ్యవహారం కొంతమంది టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదనేచెప్పాలి.