Janasena- TDP: సీమలో పొత్తు ఉన్నా లేకున్నా ఇబ్బందేనా?
Janasena- TDP: ఏపీలో జనసేన -తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు కూడా ఆ మేరకు అవకాశాలు ఉన్నాయన్నట్లుగానే సూచనలు ఇస్తూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు రాయలసీమ వరకు ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశం గురించి పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా లేకపోయినా ప్రభావం ఒకే రకంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ జనసేనలకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు ఒకే రీతిలో ఉంటుందన్నది వారి విశ్లేషణ.
రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకులలో బలిజల స్థానం ముందు వరుసలో ఉంటుంది. రాయలసీమ వరకు బలిజల్లో భిన్నమైన రకాలు ఉన్నారు, వారిలో కొందరు ఓసీలు అయితే మరి కొందరు బీసీలుగా ఉన్నారు. ఓకే ఇంటి పేరుతో ఉన్నవారు సైతం కొందరు ఓసీల్లో ఉండగా మరికొందరు బీసీల్లో ఉన్నారంటే ఈ వర్గీకరణ ఎంత గందరగోళంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓసి, బిసి అనే విషయం పక్కన పెడితే బలిజల్లో సింహభాగం తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు గానే ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమలోని పుట్టపర్తి, అనంతపురం, సింగనమల, తిరుపతి, రాజంపేట వంటి నియోజకవర్గాలలో ఈ వర్గం జనాభా గట్టిగా ఉంటుందని అంటున్నారు.
అయితే తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రభావం సామాజికవర్గం ఆధారంగానే ఉంటుందనేది విశ్లేషకులు చెబుతున్నారు. కోస్తా ఆంధ్రలో కాపుల ఓట్లను కొల్లగొట్టే వ్యూహంతో చంద్రబాబు పవన్తో పొత్తు కోసం ఆసక్తి చూపిస్తున్నారని అందరూ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కాపుల ఓట్లన్నీ తన వద్ద ఉన్నాయని వారంతా తనకే ఓట్లు గుద్దుతారని భావిస్తున్న నేపథ్యంలో అసలు రాయలసీమ వరకు అయితే పవన్ ను ఓన్ చేసుకునేవారు కానీ పవన్ చేసుకునే బలిజల ఓట్లు కానీ లేవని అంటున్నారు. ఎందుకంటే పవన్ అంటే అభిమానం ఉన్నా పార్టీ విషయానికి వస్తే వారంతా తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతారని అంటున్నారు.
యుక్త వయసులో బలిజ సామాజిక వర్గం వారు జనసేన వైపు మగ్గుచూపవచ్చేమో కానీ ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత గాని జనసేన వచ్చిన తర్వాత గాని బలిజలలో సింహభాగం ఎవరూ ఆ పార్టీ వైపు చూడలేదు సరి కదా తెలుగుదేశంతోనే ఎలాగో జనసేన ఉంది కదా అని సైలెంట్ అయ్యారు. తర్వాత ఆ పార్టీ బిజెపితో జతకట్టినా వారి వంక చూసిన పరిస్థితి లేదు. బలిజలు వైసీపీకి ముందు నుంచి ఎప్పుడు మద్దతు తెలుపుతూ రాలేదు తెలుగుదేశం పార్టీకి వారంతా మద్దతు తెలుపుతూ ఉన్న నేపద్యంలో మిగతా బీసీ కులాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. ఈ క్రమంలోనే బలిజల ఓట్ల పంపిణీ విషయంలో జనసేన తెలుగుదేశం పొత్తు ఏమాత్రం పనికిరాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాలలో వీరి కొత్త వల్ల ఒకరికొకరికి లాభం ఉంటుంది ఏమో తప్ప రాయలసీమ జిల్లాలలో మాత్రం ఉపయోగం ఉండదనే చెబుతున్నారు.