Pawan Kalyan Following KCR, YS Jagan path:ఆ సీటుకోసం కేసీఆర్, జగన్ మార్గాన్ని ఫాలో అవుతున్న పవన్
Pawan Kalyan Following KCR, YS Jagan path: ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొంతమంది ప్రజల్లోకి వెళ్లి మంచి పనులు చేస్తూ విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు గుళ్లు గోపురాలు తిరుగుతూ యాగాలు చేస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుంటారు. దీనికోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఇలా యజ్ఞ యాగాదులు నిర్వహించేవారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి వరసలో ఉంటారు. 2014లో ఆయన ఒకసారి రాజసూయ యాగం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ బాగోగుల కోసం, జనం మంచికోసం మరో యాగం నిర్వహించారు. ఆ యాగానికి అనేక మంది నేతలు హాజరయ్యారు.
కాగా, బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన సమయంలో కూడా మరోసారి రాజసూయ యాగాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన ఈ యాగాన్ని నిర్వహిస్తుంటారు. సీఎం కేసీఆర్ బలంగా నమ్మే స్వామీజీ చేతుల మీదుగా ఈ యాగాన్ని నిర్వహిస్తుంటారు. కాగా, 2019 ఎన్నికలకు ముందు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ శారదాపీఠాధిపతి చేతుల మీదుగా ఈ రాజసూయ యాగాన్ని నిర్వహించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యారు. కాగా, ఈ బాటలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పయనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు దైవబలం కోసం ఆయన ఓ స్వామీజీని కలిశారు. ఆయన చెప్పిన ప్రకారం తెలుగురాష్ట్రాల్లోని 32 నరసింహ స్వామివారి ఆలయాలను దర్శించుకోవడం పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. 32 నరసింహ స్వామీవారి ఆలయాలను దర్శించుకున్న అనంతరం యాగం నిర్వహించే అవకాశం ఉన్నది.
వచ్చే ఎన్నికల్లో విజయం కోసమే పవన్ కళ్యాణ్ సైతం ఆ బాటలో పయనిస్తున్నారు. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయని చర్చనీయాంశం. ఇటీవల పవన్ కళ్యాణ్ మట్లాడిన మాటలను బట్టి చూస్తే గౌరవప్రదమైన పొత్తులు అని చెబుతున్నారు. గౌరవప్రదమైన పొత్తులు అంటే తెలుగుదేశం పార్టీతో సమానంగా కావాలని జనసేన కోరుకోవచ్చు. తాము అడిగిన సీట్లు ఇవ్వకుంటే ఒంటరిగా పోటీకి వెళ్తామని కూడా పవన్ కళ్యాణ్ హింట్ ఇచ్చారు.
ఒకవేళ తెలుగుదేశం పార్టీ 25 సీట్ల వరకు మాత్రమే ఆఫర్ చేస్తే పరిస్థితి ఎంటన్నది ఆసక్తికరం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లు తీసుకొని, ఆ సీట్లలో విజయం సాధించినంత మాత్రానా పవన్ సీఎం కాగలుగుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. చంద్రబాబు ఉండగా మరోకరికి సీఎం పదవిని ఇవ్వడం జరగదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వబోమని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఒంటిరిగా పోటీ చేస్తే వైపీసీ, ఇటు తెలుగుదేశం పార్టీ కంటే మెరుగైన స్థానాల్లో విజయం సాధించగలుగుతారా? ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. అయితే, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఓటు బ్యాంకుగా ఎలా మలుచుకోవాలన్నది పవన్ చేతుల్లో ఉంటుంది. మరి జనసేన పార్టీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోగలుగుతుందా చూడాలి.