Janasena: నేడు మచిలీపట్నంలో జనసేన 10 వ ఆవిర్భావ సభ
Janasena: 2024 ఎన్నికలకు పవన్ ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నారు. పార్టీ పదో ఆవిర్భావ సభలో అన్ని అంశాలపై స్పష్టతనివ్వనున్నారని సమాచారం. నేడు మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. అందులో భాగంగా సన్నాహాకంగా పార్టీ కార్యాలయంలో బీసీలతో పవన్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇక 10 వ ఆవిర్భావ సభకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆవిర్భావ సభను అత్యంత అట్టహాసంగా జరపాలి అనుకున్న ఆ పార్టీకి పోలీసుల ఆంక్షలు సమస్యగా మారుతున్నాయి. అయినప్పటికీ.. ఉన్నంతలో ఘనంగా నిర్వహించేందుకు కృష్ణా జిల్లా.. మచిలీపట్నంలో భారీ ఏర్పాట్లు చేశారు.
34 ఎకరాల విస్తీర్ణంలోఏర్పాటు చేసిన ప్రాంగణంలో పవన్ ప్రసంగించనున్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లతో ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. దీనికి పొట్టి శ్రీరాములు ప్రాంగణంగా పేరు పెట్టారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేశారు. తాగునీరు, వైద్యం, మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. సభాస్థలిని పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఆవిర్భావ సభకు తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున జనసేన నేతలు, కార్యకర్తలూ తరలివెళ్లనున్నారని సమాచారం.
వారాహి యాత్రను ముందు అనుకున్నట్లు కాకుండా స్వల్పంగా మార్పులు చేశారు పార్టీ పెద్దలు. ఓ వైపు ఈరోజు అసెంబ్లీ ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయని మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కాకుండా మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ తన వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్లనున్నారు.