GO No1 Effect: వైసీపీ వర్సస్ జనసేన “రణ” స్థలం – అనుమతి దక్కేనా..
Janasena Decided to organise Youth Meeting At Ranasthalam: జీవో నెంబర్ 1. ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాటతో 11 మంది మరణించారు. దీని కారణంగా ప్రభుత్వం సభల పైన నియంత్రణ కోసం జీవో తీసుకొచ్చింది. ఈ జోవో జారీ పైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పంలో ఈ జీవో కారణంగా అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. అడ్డుకున్న పోలీసుల పైన సీరియస్ అయ్యారు. మూడు రోజుల పర్యటన కుప్పంలో ఈ రోజు పూర్తయింది. ఈ జీవో రాజకీయంగానే కాదు సినిమాల ఈవెంట్ల పైన ప్రభావం చూపింది.
ఒంగోలులో జరుగుతున్న నందమూరి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణ పైన చివరి నిమిషం దాకా సస్పెన్స్ కొనసాగింది. చివరకు స్థలం మార్పుతో అనుమతి దక్కింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ఈ నెల 8న జరగాల్సి ఉంది. ఇందుకోసం ముందుగా విశాఖలోని ఆర్కే బీచ్ సెంటర్ లో ఏర్పాట్లు ప్రారంభించారు. అక్కడ అధికారులు అడ్డుకున్నారు. అనేక తర్జన భర్జనల తరువాత ఏయూ యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఈ నెల 12 న జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి పేరిట ఒక భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువతను సమీకరిస్తోంది. ఆ సభ వేదికగానే పవన్ కల్యాణ్ తన పార్టీ యువతకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. పవన్ కల్యాణ్ కు సాధారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.
చంద్రబాబు గత నెలలోనే కుప్పం పర్యటనకు అనుమతికి దరఖాస్తు చేసినా, ఇప్పుడు జారీ చేసిన జీవో పేరుతో సభలకు నిరాకరించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సభ గురించి దాదాపు మూడు నెలల క్రితమే నిర్ణయించారు. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో కారణంగా పవన్ సభకు ఏమైనా అవాంతరాలు ఏర్పడుతాయా, యధావిధిగా కొనసాగుతుందా అనే చర్చ మొదలైంది. తాజాగా ప్రభుత్వం ఇరుకు సందుల్లో, రోడ్ల పైన సభలకు అనుమతి నిరాకరిస్తోంది. జనసేన జనవరి 122 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువత హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం తొలుత ఒక ఆడిటోరియంలో చేయాలని భావించినా..రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో రణస్థలం సమీపంలో 20 ఎకరాల లే అవుట్ లో సభ నిర్వహణకు నిర్ణయించారు.
ఈ మేరకు అనుమతి కోరుతూ జనసేన నేతలు దరఖాస్తు చేసారు. ఇప్పటి వరకు ఇంకా అధికారికంగా అనుమతులు రాలేదు. మరో ఆరు రోజుల సమయం ఉంది. పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేయాలని, సభ యధావిధిగా జరుగుతుందని జనసేన నాయకత్వం జిల్లా నేతలకు సమాచారం ఇచ్చింది. విశాఖలో పవన్ కల్యాణ్ టూర్ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. ప్రతిపక్షాలను ఏకం చేసాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ భారీ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రణస్థలం సభ విషయంలో ఏమైనా అడ్డుంకులు చెబుతుందా, సభ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తవుతుందా అనేది చూడాల్సి ఉంది.