Andhrapradesh: జగన్ ప్రభుత్వం పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన నాగబాబు
Andhrapradesh: వైసీపీ చేతకాని తనానికి, అసమర్థ పాలనకు ప్రస్తుతం రాష్టంలో జరుగుతున్నా పరిణామాలే నిదర్శనం అంటూ జనసేన సీనియర్ నేత నాగబాబు విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గత కొద్దీ రోజులుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యల పరిష్కారానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. దీనిపై సత్వరమే స్పందించిన గవర్నర్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు.
ఈ సంఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక, ఆందోళన చేయడానికి అనుమతి దొరకని పరిస్థితుల్లో ఉద్యోగులు గవర్నర్ ను కలిశారని వివరించారు. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నా.. నిమ్మకు నీరెత్తినట్టే ప్రవర్తిస్తుందన్నారు. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు కలిగివున్న గవర్నర్ కు మొరపెట్టుకునే స్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారని నాగబాబు విమర్శించారు. వైస్సార్సీపీ అసమర్థ పరిపాలనకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి? అని ప్రశ్నించారు. త్వరలోనే ఈ అసమర్ధపాలన అంతమయ్యేరోజులు దగ్గరపడ్డాయని అన్నారు.
వై.సీ.పీ. అసమర్థత పరిపాలనకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి ?
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 20, 2023