Jana Sena: ఎస్సీ, ఎస్టీల సమస్యలపై జనసేన ఫోకస్, సబ్ ప్లాన్ విషయంలో పోరాటం
Jana Sena Special meeting on January 25th on SC ST Sub Plan implementaion
జనసేన పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పలు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తునే ఉంది. తాజాగా ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలపై జనసేన ఫోకస్ చేస్తోంది. వారి సమస్యల పరిష్కారానికి కృషి మొదలు పెట్టింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని భావించిన జనసేన ఈ విషయమై చర్చావేదికను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 25న మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు చర్చా గోష్టి నిర్వహించాని డిసైడ్ అయింది. ఈ చర్చాగోష్టి విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
జనసేన విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం అనే అంశంపై చర్చ జరగనుంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి. వరప్రసాద్ చర్చాగోష్టికి నాయకత్వం వహించనున్నారు. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక విషయంలో జనసేన పార్టీ విధానం ఏమిటనే విషయం ఈ చర్చాగో్ష్టిలో వెల్లడించనున్నారు. ఈ విషయంపై సాధికారిత ఉన్న పలువురు వక్తలు చర్చాగోష్టిలో తమ తమ అభిప్రాయలను వెల్లడించనున్నారు.
2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సమగ్రాభివృద్ధి కోసం సబ్ ప్లాన్ చట్టం చేసింది. దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ శాఖల్లో నిధులు కేటాయించి ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టాన్ని అమలు చేయడంతో వైసీపీ సర్కార్ తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తోందని జనసేన భావిస్తోంది. చర్చాగోష్ఠి ద్వారా ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది.జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పీఏసీ అధ్యక్షులు నాదేండ్ల మనోహర్ కూడా జనవరి 25న జరిగే చర్చాగోష్టిలో పాల్గొంటారని జనసేన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.