Nara Lokesh :పాలనలో జగన్ కిమ్‌ని మించిపోయాడు: నారా లోకేష్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌లా రాష్ట్రంలో పాలన కొనసాగిస్తోన్నారన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తోన్న ప్రతిపక్ష నేతలపై కుట్రలు చేస్తోన్నారన్నారు. జగన్ తన పాలనలో జరుగుతోన్న అక్రమాలను వేలెత్తి చూపించిన వారిపై పగబడుతోన్నారన్నారు. పయ్యావుల కేశవ్‌కు భద్రతను ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందకు సెక్యూరిటీని తొలగిస్తారా అని లోకేష్ ప్రశ్నించారు. జగన్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనకు తానే ప్రకటించుకున్న జగన్.. రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్‌లను బట్టబయలు చేసినందుకే పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని తొలగించారని లోకేష్ మండిపడ్డారు. జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాదని పయ్యావుల కేశవ్ నిరూపించారన్నారు. కేశవ్ తనకు అదనపు భద్రత కావాలని కోరితే.. జగన్ ఉన్న భద్రతను కూడా తొలగించారని విమర్శించారు. ఈ కక్ష సాధింపులతో వైసీపీ సర్కారు వేల కోట్లు మాయం చేసి.. ఫోన్లను ట్యాపింగ్ చేసిన విషయం నిజమేనని ఒప్పుకున్నట్టైందన్నారు.