బాబును ఓడించే బాధ్యత మీదే.. సీఎం జగన్ బాధ్యతల పంపకాలు
చివరి క్యాబినెట్‌లో భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెయ్యి రోజులు మీరంతా మంత్రులుగా పనిచేశారు, మిగిలిన 700 రోజులు పార్టీ కోసం పని చెయ్యండని కోరారు. మీరంతా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులని పేర్కొన్న ఆయన మీలో కొందరు మంత్రులుగా కొనసాగుతారని, కొందరిని పార్టీ బాధ్యతలకు మారుస్తానని అన్నారు. ఈ నెల 11 న మంత్రులందరూ అందుబాటులో ఉండండని కోరిన ఆయన ఈ క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ మంచి వాళ్లే అని భవిష్యత్ లో మీకెవ్వరికి గౌరవం తగ్గదని అన్నారు. ఇప్పుడు పార్టీ కోసం పని చేసిన వాళ్ళు మళ్ళీ మంత్రులుగా వస్తారని, ఇప్పుడు పార్టీ బాధ్యతలు చేపట్టే వారి కోసం ప్రత్యేకంగా ఆలోచిస్తున్నానని, వారికి క్యాబినెట్ హోదా కల్పించేలా ఆలోచన చేస్తున్నానని అన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకం అని చంద్రబాబు మళ్లీ ఓడితే ఆయనకు రాజకీయ జీవితం ఉండదని కాబట్టి చంద్రబాబును మరోసారి ఓడించే బాధ్యత మీదే అని మంత్రులతో సీఎం జగన్ పేర్కొన్నట్టు సమాచారం. ఇకపై పార్టీ కోసం మీ సేవలు ఉపయోగించుకుంటానని పేర్కొన్నట్టు తెలుస్తోంది.