GIS Ys Jagan: జగన్ కు ఇన్వెస్టర్స్ సమ్మిట్ కలిసొచ్చిందా?
GIS Ys Jagan: తాజాగా విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనే ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం వైసీపీ ప్రభుత్వానికి పెద్ద బూస్ట్ గా నిలిచింది. ఇక పార్టీ మొత్తానికి ఆక్సిజన్ లాగా పని చేస్తుంది అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమది సంక్షేమ ప్రభుత్వం అంటూ చెప్పుకుంటూ పప్పు బెల్లాలలా పథకాలను పంచి పెడుతూ వస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ వివిధ పథకాలకు డబ్బులు పంపిణీ చేస్తున్న నేపద్యంలో జగన్ మీద, జగన్ ప్రభుత్వం మీద అనేక విమర్శలు వచ్చాయి. జగన్ కి అప్పులు చేసి పంచడం తప్ప ఇంకేమీ తెలియదని విమర్శలు వచ్చాయి. అలా పంచడం జగన్ ఏంటి ఎవరైనా చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు తెచ్చుకుంటున్న నేపథ్యంలో జగన్ కి ఈ విషయంలో అనేక ఇబ్బంది లేదురయ్యాయి.
ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం ఉన్న కంపెనీలే వెనక్కి వెళ్ళిపోతున్న క్రమంలో ఈ విషయంలో ఎలా కవర్ చేసుకోవాలో కూడా తెలియక వైసిపి సోషల్ మీడియా కూడా ఆత్మ రక్షణలో పడింది. ఈ క్రమంలోనే ఎన్నికలకు దగ్గరవుతున్న సమయంలో జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ మీద విమర్శలు రాకుండా చేసుకున్నారని అంటున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సు విషయంలో అన్ని పనులను జగన్ తన భుజాలపై వేసుకొని పక్కా వ్యూహంతో పావులు కదిపారని అంటున్నారు. తాడేపల్లి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని మొత్తం సక్సెస్ఫుల్గా చేయించారని, మంత్రులు గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రరెడ్డి ఇద్దరినీ రంగంలోకి దింపి ఢిల్లీ బెంగళూరు సహా ముంబైలో అనేకమంది కీలకమైన వ్యాపారవేత్తలను రాష్ట్రానికి ఒక్కరోజు రప్పించుకున్నారని అంటున్నారు.
ఎప్పుడూ ఇలాంటి సదస్సులకు రాని ముఖేష్ అంబానీ వంటి వారు కూడా రావడం ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నామని చెప్పడం బాగా ప్లస్ అయిందని అంటున్నారు. అదేవిధంగా జిందాల్ లాంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అని ప్రకటించడం మొదటి రోజే 13 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయని జగన్ ప్రకటించుకోవడం అన్ని ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం టిడిపి అభివృద్ధి విషయంలో విమర్శలు చేయకుండా జగన్ ఈ విధంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఇదంతా ప్రకటనలకే పరిమితం అని పెద్దగా ఈ సదస్సు వల్ల ఉపయోగం ఏమీ లేదని ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి. నిజం ఉన్నా లేకపోయినా వైసీపీ శ్రేణులకు మాత్రం ఒక పెద్ద కార్యక్రమం చేసినట్లు చూపించడంతో వాళ్లు దీన్ని పూర్తిస్థాయిలో వెనకేసుకొచ్చి 13 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయని కచ్చితంగా ఎన్నికల వరకు బాకా ఊదే అవకాశం ఉంది. ఇది తెలుగుదేశం శ్రేణులకు చాలా వరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరి తెలుగుదేశం నుంచి ఎలాంటి కౌంటర్లు ఈ విషయంలో వస్తాయో చూడాలి.