Heat Waves in Telugu States: తెలుగు రాష్ట్రాలు అగ్ని గుండంలా మారాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పుల తీవ్రత పెరిగింది. నడినెత్తిని నిప్పులు పోసినట్లు కాసిన ఎండ దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం సమయం నుంచే ఏపీ ,తెలంగాణలో పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. మధ్యాహ్న సమయంలో తీవ్రంగా వీచిన వడగాడ్పులకు భూమి నుంచి సెగలు వచ్చాయి. ఈ సీజన్లో తొలిసారిగా అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు కూడా వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. వడదెబ్బ కారణం గా సోమవారం ఏపీలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిలా మారింది. ఈ సీజన్లో తొలిసారిగా అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం… 18 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 131 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4, కృష్ణా జిల్లా కోడూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొన్నూరులో 45.9, రాజమండ్రి, ఆగిరిపల్లెలో 45.7, గోపాలపురంలో 45.4, గుంటూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేకచోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, వడదెబ్బకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
గరిష్ణ ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ రోజు కూడా వడగాల్పుల తీవ్రత పైన వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. రాత్రి ఎనిమిది గంటల తరువాత కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండలో ప్రయాణించే సమయంలో వాహనాల టైర్లు పేలిపోతున్నాయి. విద్యత్ షార్ట్ సర్క్యూట్ తో టవర్లు కాలిపోతున్నాయి. ఈ రోజు 194 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా… కొన్నిచోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, కృష్ణా జిల్లాలోని పెనమలూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాలులు వీడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువతున్నాయి. మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీలు వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని అధికారులు వివరించారు.
ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనం మధ్యాహ్నం వేళల్లో ఇంటికే పరిమితమవుతున్నారు. సాయంత్రం సమయంలో బయటకు వస్తుండడంతో రోజువారి వ్యాపారాలు పడిపోతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో.. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంచిర్యాల, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.సోమవారం మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్‌లో 45.8, జన్నారంలో 45.8, బెల్లంపల్లిలో 45.4, నీల్వాయి 45.5, కొమ్మెర 44, జగిత్యాల జిల్లా జైనాలో 45.5, కుమ్రంభీం జిల్లా కెరమెరిలో 45.4, నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో 45.1, నల్లగొండ జిల్లా పజ్జూరులో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనే హెచ్చరికలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం నుంచి 38 నుంచి 41 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. దీంతో ఎండ సమయంలో బయటకు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు.