Hyper Adhi: జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధిగా హైపర్ ఆది.. అక్కడి నుంచే పోటీ?
Hyper Adhi to Contest as MLA Candidate: జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది తాను ముందు నుంచి పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడిగా అభి వర్ణించుకుంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు పవన్ మీద ఉన్న దాని అభిమానాన్ని చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉండే హైపర్ ఆది తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన నిర్వహించిన యువశక్తి సభలో మెరిశాడు. పవన్ కళ్యాణ్ ముందే పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించడమే గాక తనదైన ప్రాసలు, పదప్రయోగాలతో విరుచుకుపడుతూ ప్రభుత్వం మీద ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే హైపర్ ఆదికి సంబంధించి ఒక కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే హైపర్ ఆది త్వరలోనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. జనసేన అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని ప్రచారం ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
తన పంచులతో ఆది అందరినీ కడుపుబ్బ నవ్విస్తాడు, అలాగే తనదైన శైలిలో మాటలతో గారడీ చేయగలడు. రాజకీయాలకు కావలసింది మాటలు గారడీ కాబట్టి ఆదిని ఒక ఎమ్మెల్యే సీటు నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆది సినిమాల్లో పెద్ద సెలబ్రిటీ కాకపోయినా బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయ్యాడు. ఆదిని ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశం గురించి జనసేన అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైపర్ ఆది స్వగ్రామం ప్రకాశం జిల్లా చీమకుర్తి దగ్గరలో ఉన్న ఒక కుగ్రామం. బీటెక్ చదివి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హైపర్ ఆది తర్వాత సినిమాల మీద ఆసక్తితో ముందుగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత అతి తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యి ఏకంగా ఆ జబర్దస్త్ లో టీం లీడర్ స్థానానికి వెళ్ళాడు. అయితే ప్రస్తుతానికి జబర్దస్త్ మానేసి ఇతర షోలు చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఒక రేంజ్ లో సంపాదిస్తున్నాడు.
హైపర్ ఆది ఎప్పటికప్పుడు మెగా కుటుంబం మీద తనకు ఉన్న ప్రేమను, భక్తిని చాటుకుంటూ ఉంటాడు. హైపర్ ఆది ఒంగోలు లేదా దర్శి నుంచి జనసేన తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా చెబుతున్నారు. పార్టీలోని కొందరు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా పవన్ కళ్యాణ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఒట్టి ప్రచారమేనా లేక నిజమేనా అనే చర్చ కూడా మొదలయింది. ఎందుకంటే ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేసే పరిస్థితుల్లో లేదని పవన్ కళ్యాణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదు. ఇలాంటి తరుణంలో హైపర్ ఆది కి ఒక సీటు అది కూడా ఆయన అడిగిన చోట ఇవ్వడం అనేది కాస్త ఇబ్బందికరమైన విషయమే. పొత్తుల వ్యవహారం తేలిన తర్వాత ఈ విషయం మీద ఒక క్లారిటీ వస్తుందని అంటున్నారు. చూడాలి మరి నిజంగానే హైపర్ ఆది జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాడా? ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది.