Dowleswaram Cotton Barrage : భారీగా వరద… మూడవ ప్రమాద హెచ్చరిక జారీ
High Alert at Dowleswaram Cotton Barrage : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. గోదావరి వరద ఉధృతి భారీగా పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 16.42 లక్షల క్యూసెక్కులు కాగా, కాసేపట్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్ పరిస్థితిని విపత్తుల సంస్థలోని కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తూ, ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి కరకట్టలు, కల్వర్టులు, వంతెనలు వాటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ, కటుకూరు గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులు, ఆహారంతో రాజమండ్రి నుంచి విపత్తుల సంస్థ హెలికాఫ్టర్ పంపింది. మరికాసేపట్లో హెలికాఫ్టర్లు గ్రామాలకు చేరనున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.