MLC Seat: వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు భారీ డిమాండ్.. ప్రదక్షిణలు మొదలు!
YCP MLC Seat: అధికార వైసీపీలో ఎమ్మెల్సీ ఆశావాహులందరూ తమకు టికెట్లు దక్కించుకునే పనిలో పడ్డారు. ఈ ఏడాది మార్చ్ జూన్ నెలలు మధ్యలో 23 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. అయితే వీరిలో కొందరికే మళ్ళీ ఛాన్స్ దక్కే అవకాశం ఉండడంతో కొత్తగా పదవులు ఆశిస్తున్న వారంతా తమకు గాడ్ ఫాదర్లుగా భావిస్తున్న వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వాళ్లకు మండలిలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. వాస్తవానికి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మండలి వల్ల ఉపయోగం లేదు, రద్దు చేస్తామనే వరకు వెళ్లారు. తర్వాత మండలిలో తమ మెజారిటీ పెరుగుతున్న కొద్దీ తమ వాళ్ళ మొహరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకప్పుడు పెద్దల సభగా చెప్పుకునే శాసన మండలిలో చర్చలు కూడా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలుగా మారిపోయాయి. అరుపులు, పెడబొబ్బలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్దరిల్లేలా ఎమ్మెల్సీలు ప్రవర్తిస్తున్నారు. అంశాల వారీ సమగ్రంగా చర్చించి సవరణలను ప్రతిపాదించాల్సింది పోయి రాజకీయ పార్టీల వారీగా విడిపోయి వాదోపవాదాలకు వేదికగా మార్చేయడమే కాదు ఏకంగా అవసరం అయితే కొట్టుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. అధికార పార్టీ సభ్యులకు బిల్లులపై కనీసం నోరెత్తే స్వేచ్చ కూడా లేదని అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక విపక్ష సభ్యులు సైతం అసలు వాటివల్ల ఎంత ఉపయోగం ఉందో చర్చ కూడా జరుపకుండా వ్యతిరేకించి బిల్లులను తిప్పి పంపడానికే అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఉన్న కొద్దిమంది పీడీఎఫ్సభ్యులు మాత్రమే బిల్లులపై సమగ్రంగా చర్చకు పట్టుపడుతూ వస్తున్నా వారి మాటలు విని చర్చించే నాధులు ఎవరు? అయినా వారే ఏవో ఒక సవరణలు సూచిస్తున్నారు. అధికార ప్రతిపక్ష సభ్యులు మాత్రం అనుకూల వ్యతిరేక గ్రూపులుగా ఒకరిమీద ఒకరు దాడి చేసుకోవడానికే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో సీటు కోసం పోటీ పడుతున్న వారి మధ్య సయోధ్య గురించి కుదిర్చి వారిలో ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
పార్టీలో ఉన్న ఇతర రెబల్ నేతలకు ఎమ్మెల్సీగా పదవులు ఇచ్చి బుజ్జగించే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్చ్ జూన్ మధ్యలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న 23 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. వీటిని పూరించడానికి జగన్ ఎప్పటిలాగే తన సామాజిక వర్గం ఫార్ములానే మళ్ళీ వాడుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. కొందరిని ఉన్నవారిని యధాతధంగా కొనసాగిస్తూనే మరికొందరికి గత ఎన్నికల్లో సీట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేని వాళ్ళకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. నియోజకవర్గాల్లో సీటు కోసం ఒకరిద్దరు పోటీ పడుతున్న నేపథ్యంలో వారిలో ఒకరికి కూడా ఈ ఎమ్మెల్సీ అవకాశం కల్పించే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో సీటు దక్కని ఇన్చార్జిలకు ఈ ఎమ్మెల్సీ పదవుల పంపకాల్లో ప్రాధాన్యత ఇస్తారని మాత్రం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి ఏమి జరగబోతోంది అనేది, అది కూడా మరికొద్ది నెలల్లోనే.