హై కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్న సుప్రీం కోర్టు
Supreme Court on R5 Zone : అమరావతి (Amaravati)లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం కోర్టు (Supreem Court) గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారం హైకోర్టు (High Court) తుది తీర్పునకు లోబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండదని పేర్కొంది. ప్రభుత్వం చేస్తున్న పట్టాల పంపిణీ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పుతో అమరావతిలోని ఆర్ 5 జోన్లో సెంటు స్థలాల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి.అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల (Petition)పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించి ఆర్ 5 జోన్ ను ఏర్పాటు చేసి సెంటు పట్టాలను పంపిణీ చేస్తున్నారని అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
సుదీర్ఘ విచారణ
జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఆర్5 జోన్లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనల అనంతరం సుప్రీం కోర్టు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు చెప్పింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని, చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 34వేల ఎకరాలలో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించామని,. పది మంది రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారని ఈ కేసు విచారణ సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. సి ఆర్ డి ఎ (CRDA) చట్టం (ACT) లోని సెక్షన్.53.1డి ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించిన సింఘి, ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్నారు. మరోవైపు సీఆర్డీఏ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఆర్-5 జోన్ అంటే…
ఏపీలోని గత ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ ప్రకారం పెట్టుబడులతో వచ్చే ఐటీ కంపెనీల కోసం కేటాయించిన ప్రాంతాన్ని విజయవాడ , గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ చట్టానికి ప్రభుత్వం సవరణ కూడా చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో ఉన్న 1,134 ఎకరాలను నివాస ప్రాంతంగా మార్చి ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.