నివురుగప్పిన నిప్పులా కోనసీమ..ఈరోజు ఏం జరిగిందంటే..
కోనసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవాళ అల్లర్లు, ఘర్షణలు జరగనప్పటికీ… పరిస్థితి మాత్రం గుంబనంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే సస్పెన్స్ నెలకొంది. పోలీసులు కూడా కోనసీమను ఆల్‌మోస్ట్ దిగ్భంధం చేశారు. నిన్నటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమలాపురం, రావులపాలెం పట్టణాలతో పాటు సమస్య ఏర్పడే అవకాశం ఉందని భావించిన ప్రతీ ఊరిలోనూ భారీగా బలగాలను మొహరించారు. జిల్లా మొత్తం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అమలాపురం మొత్తం పోలీసుల వలయంలా మారింది. సీనియర్ ఐపీఎస్‌లను పంపించింది ప్రభుత్వం. అమలాపురంలో సున్నితమైన ప్రాంతాల్లో ఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు. జోన్‌లుగా విభజించి 144 సెక్షన్ అమలను పర్యవేక్షిస్తున్నారు.
ఇక బయటి వ్యక్తులను ఎవరినీ పట్టణంలోకి రానివ్వడం లేదు. ఇతర జిల్లాలనుంచి అదనపు బలగాలను తరలించారు. జిల్లా అంతా కర్ఫ్యూ విధించారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులను ఏలూరు డీఐడీ పాలరాజు అమలాపురంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఐజీ పాలరాజు. ఇవాళ ఛలో రావులపాలెం పేరుతో ఆందోళన జరగాల్సి ఉన్నప్పటికీ దానిని భగ్నం చేశారు పోలీసులు. అడుగడుగునా పోలీసులు మోహరించారు. వివిధ గ్రామాలు పట్టణాల నుంచి వచ్చిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వాహనంపై యువకులు రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడితో అప్రమత్తమైన పోలీసులు..యువకుల వెంటపడ్డారు. దీంతో దగ్గర్లోని ఇళ్లలోకి పరుగులు తీశారు యువకులు. ఇళ్లలోకి వెళ్లి యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే రావులపాలెంలో ఆందోళనలు జరగకుండా పోలీసులు నియంత్రించగలిగారు.
నిన్న అమలాపురంలో ఆందోళనకారులు నిప్పు పెట్టిన తన ఇంటిని పరిశీలించారు మంత్రి పినిపె విశ్వరూప్. ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. ఇళ్లు నామరూపాల్లేకుండా పోయింది. ఇంట్లో ఉన్న సిలెండర్ల వరకు మంటలు వ్యాపించినా..పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇదంతా కుట్ర అని విశ్వరూప్ ఆరోపించారు. దగ్గర్లోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్ రావు ఇంటిపై దాడి జరగకపోవడాన్ని ప్రస్తావించారు. అమలాపురంలో నిన్నటి అల్లర్లలో గాయపడ్డ పోలీసులు… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆందోళనకారుల దాడుల్లో కొందరికి తల, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మరోవైపు ఘర్షణలకు సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్న అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.