Bosta Satyanarayana: ర్యాగింగ్ చేస్తే కఠిన శిక్ష..బొత్స సత్యనారాయణ
Bosta Satyanarayana: పటిష్టమైన నియంత్రణ చర్యలపై యూనివర్సిటీలు, కాలేజీలు ప్రధానంగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు సరైన మొగ్గుచూపకపోవడంతో ర్యాగింగ్ రక్కసి వికటాట్టహాసం చేస్తోంది. ఈ ర్యాగింగ్ రక్కసి వల్ల ఎంతో మందికి సేవచేయాల్సిన మెడికో ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ఇరు తెలుగు రాష్ట్రాలు మెడికల్ ,ఇంజనీరింగ్ ఇతర యూనివర్సిటీ లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలనే ఆలోచనలోఉంది.
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పై నిషేధం ఉందని స్పష్టం చేశారు. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ర్యాగింగ్ పై అవగాహన కల్పించామని తెలిపారు.
విద్యా దీవెన, విద్యా కానుక, ముఖ్యమంత్రి గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. కాగా, సైన్స్ ఎగ్జిబిషన్ ల ద్వారా విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాలను వెలికితీయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని ఆయనఅన్నారు. చదువును పక్కనపెట్టి ర్యాగింగ్ కి పాల్పడితే మీ భవిషత్తు నాశనమవుతుందని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అధ్యాపకులకు చెప్పాలని బొత్స సూచించారు.