TDP Social Media: టీడీపీ సోషల్ మీడియాకు సరికొత్త సారధి… వాటిపైనే దృష్టి
TDP Social Media: తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాపై దృష్టిసారించింది. ఈ విభాగంలో టీడీపీ యాక్టీవ్‌గా ఉన్నప్పటికీ, మరింత యాక్టీవ్‌గా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించేందుకు, ప్రజల్లోకి దూసుకెళ్లేడం కోసం కొత్త సారధిని నియమించుకున్నది. కొత్త సారధిగా జీవీ రెడ్డిని నియమించింది. జీవి రెడ్డి ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా, ఆయనకు సోషల్ మీడియా బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే సోషల్ మీడియా బాధ్యతలను చింతకాయల అయన్నపాత్రుడు కుమారుడు విజయ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా, ఆయనకు తోడుగా జీవీ రెడ్డి కూడా కలిస్తే సోషల్ మీడియాలో ప్రచారం మరింత వేగంగా ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సోషల్ మీడియా అవసరం చాలా ఉన్నది.
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను, ప్రజా ఉద్యమాలను, గతంలో చేసిన అభివృద్దిని, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం బలమైన సోషల్ మీడియా అవసరం ఉన్నది. జీవీ రెడ్డి రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో పాటు, న్యాయవిద్య, సీఏ కోర్సులు చేసి ఉండటంతో జరిగిన విషయాలపై సమగ్రంగా విశ్లేషించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో వివిధ వర్గాలను ఆకర్షించేందుకు అవసరమైన పోస్టులను క్రియేట్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఎన్నికలకు సమయం లేకపోవడంతో సోషల్ మీడియాను మరింతగా బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నది.