AP Assembly : ఏపీలో పారదర్శక…సంక్షేమ పాలన – గవర్నర్ అబ్దుల్ నజీర్
Governor Addresses AP Assembly Budget Session: ఏపీలో నాలుగేళ్లుగా సంక్షేమ..పారదర్శక పాలన కొనసాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచిందన్నారు. ఏపీలో తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలకు పెరిగిందన్నారు. రాష్ట్ర ఆర్ధికపరిస్థితి నాలుగేళ్లుగా మెరుగుపడిందని గవర్నర్ చెప్పారు. ప్రతి ఏటా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్దిరేటు సాధించిందని పేర్కొన్నారు. పరిశ్రమలు , వ్యవసాయం, సేవా రంగంలో గణనీయమైన అభివృద్దిని సాధించినట్టుగా గవర్నర్ వివరించారు. మన బడి , నాడు-నేడు ద్వారా తొలి దశలో రూ.3669 కోట్లతో ఆధునీకీకరణ చేపట్టామన్నారు.
అమ్మఒడి ద్వారా 80 లక్షల పిల్లలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్ల ఆర్ధిక సహయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అమలు చేస్తున్నామన్నారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ, విజయనగరంలో జేఎన్‌టీయూ- గురజాడ, ఒంగోలులో ఆంధ్రకేసరి , కడపలో వైఎస్ఆర్ అర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ, కర్నూల్ లో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.
నామినేటేడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మహిళల భధ్రత కోసం దిశ యాప్ ను ప్రారంభించామన్నారు. అటు వైద్య శాఖ ద్వారా 1.4 కోట్ల మందికి హెల్త్ కార్డులు అందించామని గవర్నర్ తెలిపారు. రూ.971 కోట్లతో ఆరోగ్య ఆసరా పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.9900 కోట్లతో నాలుగేళ్లుగా ఏడాదికి రూ.15 వేల చొప్పున అమ్మఒడి పథకం కింద అందిస్తున్నామన్నారు. ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా రూ.24 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. వైఎస్సార్ మత్సకార భరోసా రూపంలో మత్సకారులకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నామన్నారు. అలాగే వారికిచ్చే డీజిల్ లో సబ్సిడీ కూడా ఇస్తున్నామన్నారు.
వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు
గవర్నర్ తన ప్రసంగంలో ఇరిగేషన్ గురించి విరిస్తన్న వేళ టీడీపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. మహిళల రక్షణ..దిశకు సంబంధించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావన చేయలేదు. ప్రస్తుతం రాజధాని కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉండటంతో గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. రేపు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ ప్రారంభం కానుంది.