Vishakapatnam: గో బ్యాక్ సీఎం సార్..విశాఖ ప్రజలు తేల్చేశారా?
Vishakapatnam: 2019 దాకా విశాఖ ఏపీలో ఒక బడా సిటీ మాత్రమే కానీ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయింది. వైసీపీ అధికారంలోకి వస్తూనే మూడు రాజధానుల అజెండాను తెర మీదకు తెచ్చి విశాఖను మెయిన్ కాపిటల్ గా చేయాలని భావించారు. నిజానికి ఇది గత మూడేళ్లుగా వినిపిస్తున్న పాత మాటే అయితే మొదట్లో విశాఖ ప్రజలు ఈ అంశం మీద కొంత ఆసక్తిని ప్రదర్శించారు కానీ అది సాధ్యం కాదని కోర్టులు క్లారిటీ ఇవ్వడంతో వారిలో ఆసక్తి తగ్గింది. విశాఖ కేంద్రంగా పెట్టుబడులు వస్తాయని ఊదరగొట్టడమే కానీ జరిగింది మాత్రం ఏమీ లేదు. ఈ మధ్యనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరిట విశాఖలో భారీ ఎత్తున సదస్సు నిర్వహించి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేసుకున్నా విశాఖ సహా ఉత్తరాంధ్రా పట్టభద్రులు యువత వైసీపీ వంక కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే వారు కట్టకట్టుకుని వైసీపీని ఓడించారని అంటున్నారు.
ఇక ఉగాది నుంచి పాలన విశాఖలో ప్రారంభిస్తామని చెప్పిన సీఎం జగన్ దానిని కాస్త జూలైకి వాయిదా వేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితాలు చూసిన తర్వాత విశాఖ నుంచి పాలన కానీ ఎంతవరకు ఆచరణలో ముందుకు సాగుతుంది అన్న చర్చ సాగుతోంది. ఉత్తరాంధ్ర ఓటర్ల మనోగతం ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బయటపడిన నేపథ్యంలో టీడీపీ కూడా విశాఖ రాజధాని మీద గట్టిగా పోటీగా అటాక్ చేసే అవకశం ఉందని అంటున్నారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని టీడీపీ రూపు మాపుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితం వైసీపీకి యాంటీగా వచ్చిన నేపథ్యంలో విశాఖ ఆంధ్రా వర్సిటీ వద్ద గో బ్యాక్ సీఎం సర్.. అమరావతి రాజధానిని నిర్మించండి అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అయింది. జన జాగరణ సమితి పేరిట వెలసిన ఈ ఫ్లెక్సీలు విశాఖలో దుమారం రేపాయనే చెప్పాలి.
జన జాగరణ సమితి పేరుతో ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం సంచలనం రేపగా దీని వెనక ఎవరు ఉన్నారన్న దాని పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఏయూ అధికారులు అప్పటికప్పుడు ఆ పోస్టర్లు తొలగించారు. అనంతరం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఇక విశాఖ మన రాజధాని అక్కడ నుంచే పాలన అని జగన్ చెప్పి చాలా రోజులు అయింది కానీ అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అది కూడా ఎమ్మెల్సీ ఫలితాలు ఒక వైపు వస్తూంటే మరో వైపు ఇలా పోస్టర్లు వేయడం మీద పట్ల చర్చ సాగుతోంది. ఈ దెబ్బతో విశాఖ చుట్టూ రాజకీయం కొత్త మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని ఏ రకంగా కొత్త వ్యూహాలతో ముందుకు వస్తుంది అనేది చూడాలి.