GIS 2023: ఏపీకి 13.41 లక్షల కోట్ల పెట్టబడులు..దశ తిరిగేనా
Global Investors Summit 2023: విశాఖపట్నంలో రెండు రోజులు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ముగింపు ప్రసంగం చేశారు. పారిశ్రామిక వేత్తలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్.. పెట్టుబడులతో రాష్ట్రం బాగా అభివృద్ధి అవుతుందని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకై ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా 15 రంగాల్లో ఈ పెట్టుబడులకు కీలకంగా మారాయి. సమ్మిట్ విజయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా ఉందన్నారు సీఎం జగన్.
రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో తరలివచ్చిన దేశ విఖ్యాత పారిశ్రామిక వేత్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు సమ్మిట్‌లోని ముఖ్యమైన విషయాల్ని వివరించారు. ఏపీ అభివృద్దికి ఈ 15 సెక్టార్లు అత్యంత కీలకం. ఈ రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయి. రెండ్రోజుల్లో 353 ఎంవోయూలతో 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సమ్మిట్ ద్వారా ఏపీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందని తెలిపారు. ఎంఓయూలు అమలు పర్యవేక్షణకు సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని ప్రకటించిన జగన్ ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుటామని హామీ ఇచ్చారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చిన వేళ ఇక రాష్టంలో నిరుద్యోగ సమస్య ఉండదని అన్నారు.