GIS 2023 Vizag: నేటి నుండి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం
Global Investor Summit Start From Today: విశాఖలో ఈరోజు నుండి రెండు రోజులపాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనున్నది. ఈ సదస్సు కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విశాఖ కేంద్రంగా జరగనున్న ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, దేశంలోని టాప్ కంపెనీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, నాయకులు పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. తొలిరోజు సమావేశాల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, కిషన్ రెడ్డి, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు తదితరులు ప్రసంగించనున్నారు.
ఈ సమావేశాల్లో ఏర్పాటు చేసిన 118 స్టాల్స్‌తో కూడిన ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్, నితిన్ గడ్కారీలు ప్రారంభించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుండి వివిధ రంగాలకు చెందిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సు ద్వారా రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని రకాల ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండో రోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సదస్సు జరుగుతుంది. రెండో రోజు కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెట్టుబడులతో ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం అనుకున్న విధంగా పెట్టుబడులు వస్తాయా చూడాలి.