G20 working Group Meeting: విశాఖలో జీ 20 వర్కింగ్ గ్రూప్ సమావేశం…ఏర్పాట్లపై సమీక్ష
G20 working Group Meeting: ఈ ఏడాది భారత్‌లో జీ 20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ నగరాల్లో సుమారు 200 సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. సమావేశాల అజెండా దిశగానే ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మార్చి 28,29 తేదీల్లో విశాఖలో సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు సభ్యదేశాలు, 300 మంది ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. రెండు రోజులపాటు సన్నాహక సమావేశాలు జరగనున్నాయి.
కాగా, ఈ సమావేశాల ఏర్పాటు కోసం విశాఖ పురపాలక శాఖ సమీక్షను నిర్వహించింది. ఈ సమావేశాల్లో అర్టెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, ఇంగ్లండ్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని 19 సభ్యదేశాలు కూడా పాల్గొననున్నాయి. ఈ సమావేశాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్లను విశాఖ పురపాలక శాఖ పరిశీలిస్తున్నది. సమావేశాలకు హాజరయ్యే వారికోసం వసతుల కల్పనపై కూడా అధికారులు సమీక్షించారు. ఈ వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం నుండి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.