Raghuveera Reddy Political Re Entry : రఘువీరారెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ అప్పుడేనా?
Raghuveera Reddy Political Re Entry : ఒకప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పిన నేత, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర ప్రదేశ్ కి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొన్నాళ్లు పని చేశారు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా ప్రైవేటు లైఫ్ కి అలవాటు పడిపోయారు. దాదాపుగా ఆయన ఎవరో మీకు ఈపాటికి అర్థం అయిపోయి ఉంటుంది. ఆయన మరెవరో కాదు రఘువీరారెడ్డి, వాస్తవానికి చాలా కాలంగా రఘువీరా రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీ తెలంగాణ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ మీద పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయన పూర్తిగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్న పరిస్థితి అందరికీ తెలు.సు వ్యవసాయం చేసుకుంటూ తన సొంత ఊరైన అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠ పురానికి ఆయన పరిమితం అయిపోయారు.
తన గ్రామంలో టీవీఎస్ ఎక్సెల్ మీద తిరుగుతూ ఆధ్యాత్మిక భావంతో పూర్తి సమయం కుటుంబానికి కేటాయిస్తూ వ్యవసాయం చేస్తూ నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేసుకుంటున్నారు. అలాగే అక్కడి ఊరి ప్రజల కోసం ఒక కంటి ఆసుపత్రి కూడా నిర్మించారు. ఎక్కువగా గ్రామ అభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్న ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా అంటే దూరంగానే ఉంటున్నారని చెప్పాలి. అయితే రాహుల్ గాంధీ ఆ మధ్య భారత్ జోడో యాత్ర పేరుతో అనంతపురంలో కూడా కొంత దూరం నడిచారు. ఈ సందర్భంగా ఈ యాత్రకు హాజరైన రఘువీరారెడ్డి రాహుల్ గాంధీని కూడా కలిశారు. దీంతో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇవ్వవచ్చని అంచనాలు, ప్రచారాలు జరిగాయి. కానీ దానికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు. ఇక తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ ఏడాది ఉగాది తర్వాత రఘువీరా రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఆయన రాజకీయ భవిష్యత్తుపై పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక రఘువీరారెడ్డి ఈ ఉగాది తర్వాత ప్రత్యక్షంగా ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కాంగ్రెస్ లో అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన కాంగ్రెస్ లోనే మళ్లీ యాక్టివ్ అవుతారా లేక తెలుగుదేశం పార్టీ లేదంటే అధికార వైసీపీ ఇలా వేరే పార్టీలలో చేరుతారా అనే విషయం మీద సంధిగ్దత కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు అధికార వైసీపీ సహాయ జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయి కానీ ఆయన మాత్రం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలంటున్నారని వాయిదా వేస్తూ వస్తున్నారు.
ఇక ఆయన రీఎంట్రీకి సిద్ధమైన నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారు అనే విషయం మీద మాత్రం చర్చ జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ లోనే యాక్టివ్ అవుతారు అని భావిస్తున్నా చివరి నిమిషంలో ఏం జరుగుతుంది అనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి మంచి పేరు సంపాదించారు. చూడాలి ఆయన పొలిటికల్ రీయంట్రీ ఎప్పుడు ఉండబోతోంది ఎలా ఉండబోతోంది అనేది.