Heavy Rains: ఏపీలో తగ్గని వర్షాలు..ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద
Heavy Flood in Projects:ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరానికి భారీగా వరద వస్తోండడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతోన్నారు. ధవళేశ్వరానికి 15.07 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోండగా.. అధికారులు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతోన్నారు. వరద ప్రవాహాన్ని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఏపీ విపత్తు శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు గోదావరికి వరద ప్రవాహం అధికంగా కొనసాగుతుండడంతో వరద ప్రభావిత జిల్లాల అధికారులు ఏపీ విపత్తు శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే రేపు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఏ మండలాలపై ప్రభావం పడనుందో ముందుగానే అంచనా వేస్తున్న అధికారులు.. ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రలించేందుకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 5 NDRF, 4 SDRF బృందాలు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.