MLC Elections: తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం, వైసీపీని టార్గెట్ చేస్తున్న విపక్షాలు
Fake Voters in Tirupathi MLC Elections
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో దొంగ ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో దొంగ ఓట్ల విషయం సంచలనంగా మారింది. అర్హత లేని వేలాదిమందికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారంటూ ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఒక్క తిరుపతిలోనే ఏడు వేల దొంగ ఓట్లు ఉన్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. డిగ్రీ అర్హత లేకుండా ఓటర్లుగా నమోదై లిస్టులో ఉన్న వారిపై వామపక్షాలు దృష్టి సారించాయి. నగరంలోని అధికార వైసీపీ కార్యాలయం చిరునామా పేరిటే 20 దొంగ ఓట్లు ఉన్నాయని సీపీఎం..ఆరోపిస్తోంది.
దీంతో ఓటర్లుగా ఉన్న వాళ్ళ ఇళ్లకు వెళ్లి వామపక్ష నేతలు విచారిస్తున్నారు. చదువు రాని వారు, పదవ తరగతి కూడా పూర్తి చేయని వారికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కల్పించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్ననేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. డిగ్రీ పత్రాల జెరాక్స్ లో పేర్లు మార్చి ఓటర్లుగా నమోదైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో టిడిపి, సిపిఎం, సిపిఐ నేతలు అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా ఖూనీ చేస్తున్నారు – నారాయణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయించిన రెవెన్యూ అధికారులను ఉరితీయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. తిరుపతి వైసీపీ పడమటి కార్యాలయం చిరునామాతో 36 దొంగ ఓట్లను నమోదు చేశారని నారాయణ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడిన పిడిఎఫ్ అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని నారాయణ విమర్శించారు. వాలంటీర్ ఇంటిలో 22 ఓట్లు నమోదు చేయించారని, ఒక మహిళకు 21మంది భర్తలు ఉన్నట్లు సృష్టించి ఓట్లు నమోదు చేశారని నారాయణ తెలిపారు. యశోద నగర్ లోని ఖాళీ స్థలంలో 11 ఓట్లు నమోదు చేయించారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు అంతులేకుండా పోతోందని నారాయణ మండిపడ్డారు. తిరుపతి నగరంలో మొత్తం 7 వేల దొంగ ఓట్లున్నాయని అన్నారు.