Fake Votes: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ ఓటర్లు
Fake Votes: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి అధికార పార్టీ అనుసరిస్తున్న అడ్డదారులకు అంతులేకుండా ఉంది. తిరుపతి లో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేయించింది. వైసీపీ మాయాజాలంతో కాలేజీ మెట్లక్కని వారంతా గ్రాడ్యుయేట్లు అయిపోతున్నారు. రాష్ట్రంలో మూడు స్థానాలకు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ అక్రమాలకు తెరతీసిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వేల సంఖ్యలో బోగస్ ఓట్లను నమోదు చేయడం ద్వారా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పదో తరగతి చదవని కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు దక్కించుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
ఈ నెల 13 తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లు, బాధ్యులతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ పక్క బోగస్ ఓట్లు మరో పక్క ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వీటిని సమర్థవంతంగా అడ్డుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కారణంగా గ్రామ స్థాయి వరకు ప్రచారాన్ని వేగవంతం చేయాలని సూచించారు.