ఎమ్మెల్యే వసంతతో మాజీ ఎంపీ లగడపాటి భేటీ… మళ్లీ యాక్టీవ్ కానున్నారా?
కాంగ్రెస్‌పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండగా పార్టీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో లగడపాటి రాజగోపాల్ ఒకరు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయాల్లో లగడపాటి సర్వేలపై ఓ నమ్మకం ఉండేది. 2014 తరువాత రాజకీయంగా లగడపాటి పేరు పెద్దగా బయటకు రాలేదు. ఇన్నాళ్ల తరువాత లగడపాటి మళ్లీ బిజీ కాబోతున్నారా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే అంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమారిడి వివాహానికి లగడపాటి హాజరయ్యారు. ఈ వేడుకకు మైలవం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.
ఆ సమయంలో మాజీ ఎంపీ లగడపాటిని ఎమ్మెల్యే వసంత, వైసీపీ నేతలు కలిశారు. వివిధ విషయాలపై చర్చించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి మరోసారి రాజకీయ నేతలతో కలిసి చర్చలు జరపడం ఆసక్తిగా మారింది. అయితే, ఇది రాజకీయాలతో సంబంధం లేదని కేవలం సొంత విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని లగడపాటి మీడియాతో చెప్పుకొచ్చారు. తనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని లగడపాటి మీడియాతో పేర్కొన్నారు.