Prabhakar Chowdary: ‘అనంత’ వస్తే పవన్ ను దగ్గరుండి గెలిపిస్తా..!
EX MlA Prabhakar Chowdary on Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ భేటీ అవ్వడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోగా చంద్రబాబు ఆయనను విజయవాడలో కలుసుకొని పరామర్శించారు. ఇప్పుడు అదేవిధంగా సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడంతో పవన్ కళ్యాణ్ ఆయనను కలిసి పరామర్శించబోతున్నారని మీడియాకు లీకులు అందాయి.
అయితే పొత్తుల మీద కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మీద రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేకపోయాడు అనే అపవాదు ఉంది. అయితే ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభాకర్ చౌదరి ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తానని కామెంట్లు చేశారు. ఆ బాధ్యతలు తన భుజస్కందాల మీద వేసుకొని మరీ గెలిపిస్తానని ఆయన కామెంట్ చేయడం ఆసక్తికరంగా ఉంది.
జనసేన, టీడీపీ లక్ష్యం ఒకటేనని వైసీపీ ఓటమి చెంది జగన్ ఇంటికి వెళ్లి పోవడమే అంటూ ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించారు జనసేన మాకు గతంలో పొత్తులో ఉన్న పార్టీ అని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో ఎన్నికలకు తన వ్యూహం వేరే ఉందని గతంలోనే చెప్పాడని ఆయన ఉదహరిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దీనికి బలం చేకూరుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదే అంశాన్ని పేర్కొంటూ ప్రభాకర్ చౌదరి కూడా మాట్లాడడంతో పొత్తుపై ఈ రోజే ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లు అయింది.