శ్రీశైలం వెళ్లాలనుకునే వారికి ఈవో సూచనలు
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఉత్సవాలు ముగిసేవరకు తమ యాత్ర వాయిదా వేసుకోవాలని ఈవో లవన్న కోరారు. ఈ నెల 24 నుంచి 30 వరకు భక్తులందరికి స్వామి వారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు. స్పర్శ దర్శనం కారణంగా దర్శనానికి సుమారు 12 గంటల సమయం పెట్టె అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు,చంటిపిల్లల తల్లులు, యాత్ర వాయిదా వేసుకొని దేవస్థానానికి సహకరించాలని ఆలయ ఈవో లవన్న కోరారు. అయితే, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఉగాది ఉత్సవాల సమయంలో లింగ దర్శనం ఉండదని కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఈవో లవన్న స్పష్టం చేశారు. కాలినడకన వస్తున్న భక్తులతో దేవస్థానం అనుమతితో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు మార్గమధ్యలో అన్న పానీయాలు అందజేస్తున్నారు. వారికి ప్రత్యేక కంకణాలు ఏర్పాటు చేసి శ్రీఘ్రదర్శనం ద్వారా దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని లవన్న తెలిపారు. మరోపక్క క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, మంచినీరు, పాలు, మజ్జిగ నిరంతరంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే యాత్రికులు దేవస్థానం అధికారులు, సిబ్బందితో సహకరించాలని ఈవో కోరారు.