AP Employees Vs Govt: తలొగ్గుతారా… తలపడతారా?
AP Employees Vs Govt: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నది. గత నాలుగేళ్లుగా ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని ప్రభుత్వ అధికారులు ఆందోళనల చెందుతున్నారు. అధికారంలోకి వచ్చే ముందు జగన్ అనేక హామీలు ఇచ్చారు. మొదటి ఏడాది కాబట్టి ఉద్యోగులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పటికే నాలుగేళ్లు గడిచిపోయాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈనెల 9వ తేదీ లోగా గతంలో ఇచ్చిన హామీలు, డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే ఉద్యమం తప్పదని అల్టిమేటం జారీ చేశారు.
చాలా కాలంగా ప్రభుత్వం ఉద్యోగులతో చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. ఎన్నికల వరకు ఏదోవిధంగా లాక్కురావాలని చూసినా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమాల పేరుతో ఖర్చు చేస్తున్నది. ఉద్యోగులను పట్టించుకోవడం లేదని, పైగా ఉద్యోగులకు కొత్త నిబంధనల పేరుతో బయోమెట్రిక్‌తో పాటు ముఖ గుర్తింపు ఖచ్చితం చేయడంతో మండిపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తోందని మండిపడుతున్నారు.
ఉద్యోగులు ఇప్పుడు ఇంతగా పట్టుపట్టడానికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైపీసీ చూస్తున్నది. కానీ, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించినట్లు సమాచారం. ఇక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని లేదా అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరుద్యోగులు, పట్టభద్రులు పోటీ చేయాలని నిర్ణయించారు.
ఒకవేళ ఇదే జరిగితే అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ ఇబ్బందుల నుండి బయటపడాలంటే తప్పని సరిగా వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. పట్టభద్రుల ఎన్నికల్లో యువకులు, నిరుద్యోగులు ఎక్కువగా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. వీరంతా వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేందుకు రాష్ట్రంలో పరిశ్రమలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల కోసం పక్కరాష్ట్రాలకు తరలివెళ్లాల్సిన అవశ్యకత ఏర్పడింది.
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఒక్క కొత్త నిర్మాణం కూడా జరగలేదు. రోడ్లు ఎక్కడికక్కడ దారుణంగా మారిపోయాయి. జాతీయ రహదారులు మినహా రాష్ట్ర, పంచాయతీరాజ్ రహదారులు పరిస్థితులు అత్యంత దారుణంగా మారిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్కార్ వద్ద ఉన్న కాస్త నిధులను సంక్షేమాల కోసం షెడ్యూల్ చేసుకొని పక్కన పెట్టుకున్నది. మరి ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా వారి డిమాండ్లను నెరవేర్చడానికి భారీగా నిధులు అవసరం అవుతాయి. ఆ నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.