Drone Tension in Tirumala: తిరుమలలో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు
Drone Tension in Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంపై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టయింది. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుమలలో ఎలాంటి డ్రోన్‌లకు అనుమతులు లేవు. అంతేకాదు, ఆలయం పై గుండా ఎలాంటి విమానాలు ప్రయాణాలు చేయడానికి కూడా వీలు లేదు. తిరుమలలో సుమారు 1600లకు పైగా సీసీటీవీలు ఉన్నాయి. నిరంతరం నిఘా ఉంటుంది. భారీ భద్రతను దాటుకొని డ్రోన్ కెమెరా ద్వారా ఎలా విజువల్స్‌ను రికార్డ్ చేశారన్నది అనుమానంగా మారింది. భద్రతా వైఫల్యాలపై అధికారులు దృష్టి సారించారు.
ఇక, గతేడాది నవంబర్ నెలలో సామాజిక మాధ్యమాల్లో పోస్టైన ఈ వీడియోపై విజిలెన్స్ అధికారులు దృష్టిసారించారు. ఈ వీడియో నిజమైనదా లేక నకిలీదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. త్వరలోనే అన్ని విషయాలను తెలుసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇక భద్రత విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు పేర్కొన్నారు. తిరుమలేశుని ఆలయం చుట్టుప్రక్కల 1600 సీసీటీవీ కెమెరాలు నిత్యం పనిచేస్తుంటాయి. వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ అధికారులు కూడా ఈ వీడియోపై దృష్టి సారించారు. వీడియో చిత్రీకరించిన వారిని విచారిస్తున్నారు.