YSRCP: వైసీపీది నిర్లక్ష్యమా? లేక అహంకారమా?
YSRCP on MLC Elections: తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలోని అధికార వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. ఏదో ఒక స్థానం తెలుగుదేశం గెలుచుకోవచ్చని అంచనాలు ముందు నుంచి ఉన్నా ఎవరు ఊహించని విధంగా మూడు స్థానాలు దక్కించుకోవడం ఆ పార్టీ నేతలకు గానీ మింగుడు పడడం లేదని చెప్పాలి. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగే ఎలాంటి ఎన్నికల్లో అయినా ఆ పార్టీనే పూర్తిస్థాయిలో పై చేయి సాధించడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ అధికార పార్టీ ఇదే పై చేయిగా ఉంటుంది. స్థానిక సంస్థల, పంచాయతీ, మునిసిపల్, నగరపాలక సంస్థ అదే విధంగా ఏదైనా ఎమ్మెల్సీ, ఉప ఎన్నికల లాంటివి జరిగినా కూడా అదే విధమైన ఫలితాలు రిపీట్ అవుతూ ఉంటాయి.
ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఏమైనా ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం కచ్చితంగా తమ మీద వ్యతిరేకత ఉందని ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిందే అని ప్రభుత్వ పెద్దలు కచ్చితంగా అర్థం చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తాజాగా వైసిపి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు నాలుగేళ్ల తర్వాత తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక విధంగా షాక్ ఇచ్చే విధంగా సాగాయి. ఇదే ఎన్నికలతో పాటు ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరగగా వాటిలో వైసీపీ పై చేయి సాధించింది. రెండు స్థానాల్లో పిడిఎఫ్ అభ్యర్థులు గెలిచిన మిగతా స్థానాల్లో వైసీపీ హవా నడిచింది.
ఒకరకంగా ఇది వైసిపికి ఊరటం ఇచ్చే అంశమే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు విషయంలో ముఖ్యంగా టీచర్ల విషయంలో వారికి కొత్త రకాల అటెండెన్స్ లు ప్రవేశపెట్టడం, సెల్ఫీతో హాజరు ప్రవేశపెట్టడం వైన్ షాపు దగ్గర డ్యూటీలు వేయడం, ఎన్నికల విధుల నుంచి తప్పించడం లాంటి నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో వ్యతిరేకత పెద్ద ఎత్తున బయటపడుతుందని ఊహించారు. కానీ అవేవీ లేకుండానే సాఫీగా సాగిపోయాయి కానీ పట్టభద్రులు ఎన్నికల విషయంలో సాఫీగా సాగిపోతుంది అనుకుంటే మాత్రం పరిస్థితి తారుమారు అయింది.
అధికారంలో ఉండి కూడా వైసిపి తాను బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిందని అపవాదు ఏర్పడింది. వైసిపి దొంగ ఓట్లు సృష్టించి రిగ్గింగ్ కూడా పాల్పడుతుందని వైసిపి మినహా మిగతా అన్ని పక్షాల వారు ఆరోపించినా ఆసక్తికరంగా వైసిపి అక్కడ గెలవలేకపోయింది. ఒకరకంగా వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ జగన్ టార్గెట్లు పెట్టుకుని రంగంలోకి దిగుతుంటే మరోపక్క ఆయన సొంత ప్రాంతానికి చెందిన టిడిపి నేత ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడం వైసిపి శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీది అసలు నిర్లక్ష్యమా అహంకారమా అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ విషయంలో జగన్ ఇప్పటికీ మేలుకోకపోతే కచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.