Pawan Kalyan : పవన్ ‘రాధా’ను కార్నర్ చేశారా?
Pawan Kalyan : జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవడంతో నిన్న మచిలీపట్నంలో ఘనంగా జనసేన పదవ ఆవిర్భోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సభలో పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడడమే కాక అనేక సంచలన విశ్లేషణలు సైతం తెర మీదకు తెచ్చారు. పవన్ చేసిన కామెంట్ల మీద ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కాపు సామాజిక వర్గం మొత్తం తమ ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహన్ రంగా అంశం మీద సంచలన విశ్లేషణ చేశారు.
వంగవీటి మోహన్ రంగా కాపు నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, అయితే ఆయన విజయవాడలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారి అనే ఆవిడ వివాహం చేసుకోవడం ద్వారా తాను ఏ కులానికి మతానికి పరిమితమైన వాడిని కాదని సందేశం ఇచ్చారని పవన్ అన్నారు. ఎప్పుడో దశాబ్దాల క్రితమే వంగవీటి రంగాకు ప్రాణహాని ఉందని తెలిసినా ఇక్కడి కాపులు ఆయనను రక్షించుకోలేకపోయారని పవన్ అన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన రత్న కుమారిని పెళ్లి చేసుకుంటే ఆయనకు గాని ఆయన కుమారుడికి గాని ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు.
రాధానే ఈ విషయంలో మౌనంగా ఉంటున్నప్పుడు మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి అని పవన్ కాపు యువతను ప్రశ్నించారు. ఈ కామెంట్స్ ద్వారా కమ్మ సామాజిక వర్గానికి తాను శత్రువులం కాదని అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం పవన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోబోతున్నారని అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వంగవీటి రంగాను హత్య చేసిన తెలుగుదేశం పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో పవన్ వ్యూహాత్మకంగా ఈ ప్రసంగం చేసినట్లుగా అర్థం చేసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణకు ఇబ్బందికరంగా మారాయి. ఎందుకంటే తెలుగుదేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు రాధాకృష్ణ. ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జరిగినా ఎందుకో వెనకడుగు వేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వంగవీటి రంగా విగ్రహాలు ఎవరు ప్రతిష్టించినా వాటి ప్రారంభోత్సవానికి రాధాకృష్ణ వెళ్తున్నారు. తన తండ్రి మాదిరిగానే బలమైన కాపునేతగా ముద్ర వేసుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాధా దూకుడుకి బ్రేకులు వేసేందుకే పవన్ కళ్యాణ్ కమ్మలకు కాపులకు మధ్య ఎలాంటి వైరం లేదనే విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తద్వారా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోనున్నా కులాల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లబోతున్నారని అంటున్నారు.