Dharmana: ఉత్తరాంద్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని అందుకే అడిగా!
Dharmana Clarity for Demanding Separate Uttarandhra State: ఉత్తరాంద్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాను అలా నేను ఎందుకు అన్నానో తెలుసా? అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. 60 ఏళ్ళు ఈ ప్రాంతం పూర్తిగా దోపిడీకి గురయిందని, ప్రజల పన్నులన్నీ తీసుకువెళ్లి అమరావతి అభివృద్ధి చేస్తామంటే ఈ ప్రాంత వ్యక్తిగా నేను అంగీకరించనని అన్నారు. వికేంద్రీకరణను ప్రపంచవ్యాప్తంగా విశ్వసిస్తున్నారని, చంద్రబాబుకు పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ అమరావతిలోనే పెట్టుబడి పెడతాడని అన్నారు. ఒకవేళ అదే జరిగితే మాకు విశాఖ కేంద్రంగా రాష్ట్రం అడిగానని ఆయన అన్నారు.
మా ప్రాంతానికి వచ్చి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతారా? అని ప్రశ్నించిన ఆయన అమరావతి పేరుతో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పవన్ సమర్ధిస్తున్నాడని అన్నారు. నా నోరు నొక్కేస్తే మా హక్కులు కోసం పోరాటం ఆగదని పేర్కొన్న ఆయన మరో 50 ఏళ్ల సొమ్ము అమరావతిలో పెడతామంటే తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం అడుగుతామని అన్నారు. పవన్ ఎవరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు? అని ప్రశ్నించిన ఆయన నిజాయితీ ఉన్న నాయకులకు మద్దతు ఇమ్మని పవన్ చెబుతున్నాడు, అవినీతిపరుడైన చంద్రబాబుని సమర్ధించి శ్రీ శ్రీ నీతులు చెబుతావా అని ధర్మాన ప్రశ్నించారు. ఇక నేను సైనికుల భూములు కబ్జా చేశానంటున్నారు కదా రెవెన్యూ మంత్రిగా ఒక్క సెంటు భూమి తీసుకునే హక్కు కూడా నాకు లేదని ఆయన అన్నారు. అసలు ఏ సైనికుడు నేను వారి భూమి కబ్జా చేశానని చెప్పాడు? అని ధర్మాన ప్రశ్నించారు. పవన్ కు ఒక స్టాండ్ లేదన్న ఆయన ఇప్పటివరకు ఎందుకు పవన్ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారో ఆలోచించుకోవాలని అన్నారు.