Daggubati Venkateswara Rao: రాజకీయాలనుండి వైదొలుగుతున్నా.. దగ్గుబాటి వెంకటేశ్వర రావు
Daggubati Venkateswara Rao: ఎన్టీఆర్ అల్లుడు పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాలనుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికి చాలా కాలంగా చురుకుగా లేరు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరూ రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు.
ఇక్కడి ఇంకొల్లు తో తనకు ఎంతో అనుబంధం ఉందని అందుకనే తన మనసులోని మాటను ఇక్కడ బయటపెట్టినట్టు చెప్పారు. ఒకప్పటి రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలకు ఏమాత్రం పొంతన లేదన్న వెంకటేశ్వరరావు డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు. అందుకనే రాజకీయాలకు తాము పూర్తిగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి కూడా. పర్చూరు నుంచి అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే, లోక్‌సభ, రాజ్యసభకు కూడా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు.
నిత్యం డబ్బుతో నడిచే రాజకీయాలు చేయలేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం విలువలతో కూడిన రాజకీయాలు అసలు లేవని… రాజకీయాల్లో ఉండడం ఇప్పుడు కష్టమని తెలిపారు. తాను నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే… రాజకీయాలలో, లేకుండా ప్రజాసేవ చేస్తానని వెల్లడించారు.