Dadisetty Raja: హవాలా చేస్తూ పట్టుబడ్డ పవన్.. మంత్రి సంచలన ఆరోపణలు!
Dadisetty Raja Allegations on Pawan Kalyan: పవన్ కల్యాణ్ యువశక్తి సభలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో ఆయన మీద ఏపీ మంత్రుల దాడి కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కూడా చేరి అసలు పవన్ కల్యాణ్ ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని అన్నారు. కాపులను పవన్ కల్యాణ్ తన యజమాని చంద్రబాబుకు అప్పగించాడని, ఇలాంటి శునకాలు చంద్రబాబు వద్ద చాలానే ఉన్నాయి అంటూ ఘాటు వ్యాఖలు చేశారు. వైఎస్సార్ ను సైతం డీ కొట్టానని అంటున్న పవన్ కు ఆయన పేరెత్తే అర్హత లేదని, గతంలో వైఎస్సార్ దెబ్బకు ప్రజారాజ్యం తుడిచిపెట్టుకుపోయిందని, ఇప్పుడు సీఎం జగన్ దెబ్బకు జనసేన పార్టీకి కూడా అదే గతి పట్టడం ఖాయమని అన్నారు.
అంతేకాక పవన్ మీద దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ రూ.1,800 కోట్లు పోలెండ్ కు హవాలా చేస్తూ కేంద్రానికి దొరికిపోయాడని ప్రచారం జరుగుతోందని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కేంద్రం వద్ద ఉన్నాయంటూ రెండు మూడు నెలల నుంచి ప్రచారం జరుగుతోందని అన్నారు. భీమ్లానాయక్ సినిమాను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల రూ.30 కోట్లు పోయాయి అని పవన్ అంటున్నారని, ఆ సినిమా ప్రొడక్షన్ ఖర్చులే రూ.20 కోట్లు దాటకపోతే, రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుంది అని మంత్రి ప్రశ్నించారు. నాసిరకం సినిమా ప్రజలు చూడకపోతే, అందుకు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించిన రాజా తక్కువ బడ్జెట్ లో వచ్చిన కాంతార ఏ విధంగా హిట్టయ్యిందో అందరూ చూశారని పేర్కొన్నారు.