Cyclone Mandous: మాండస్ తుఫాన్ తో వేల ఎకరాల్లో పంటనష్టం.. రైతన్న ఆవేదన
Cyclone Mandous: మాండూస్ తుపాన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైంది. రాత్రి పది గంటల ప్రాంతంలో కూడా ఈ జిల్లాలతో పాటు, మరికొన్ని ఇతర జిల్లాల్లోనూ వర్షం కురుస్తూనేఉంది. బాపట్ల జిల్లా, చీరాల వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తుపాన్ తీరం దాటే సమయంలో కురిసిన భారీ వర్షధాటికి తమిళనాడులో బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. నలుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 100 పశువులు మరణించాయి. 200 ఇళ్లు నేలకూలాయి. తమిళనాడులో నష్టతీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు శనివారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధిత ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష తీవ్రత తగ్గిన తరువాత నష్టాల లెక్కలు తీయాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్‌రెడ్డి కూడా తుపాన్ పీడిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు ఆయన చెప్పారు. శనివారం మధ్యాహ్నానికి 708 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అవసరమైతే మరింతమందిని తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకారణంగా ప్రకాశం జిల్లాలో 3,190 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. పంట చేతికొచ్చే వేళ విరుచుకుపడిన తుఫాన్‌వల్ల వేలాది ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
తిరుపతి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, రిజర్వాయర్లు నిండిపోయాయి. వాగులు, వంకలు, జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కపిలతీర్థం, మాల్వాడిగుండం జలపాతాలు హోరెత్తుతున్నాయి. శ్రీవారి మెట్ల వద్ద వరద నీరు చేరడంతో తో శనివారం తిరుమల నడక మార్గాన్ని మూసివేశారు. అలాగే విమాన సర్వీసులు రద్దయ్యాయి. వందకు పైగా ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారు.