అసనీ తుఫాన్ ఎఫెక్ట్… ఏపీలో 37 రైళ్లు రద్దు…
అసనీ తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తున్నది. ఇప్పటికే బాపట్ల తీరాన్ని తాకిన అసనీ తుఫాన్ మరికాసేపట్లో పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 37 రైళ్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లను దారిమళ్లించారు. ప్రయాణికులు తమ ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది.
విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్- నిడదవోలు, విజయవాడ నర్సాపూర్, నిడదవోలు-భీమవరం జంక్షన్, మచిలీపట్నం-గుడివాడ, భీమవరం జంక్షన్-మచిలీపట్నం, భీమవరం-విజయవాడ, గుంటూరు-నర్సాపూర్, గుడివాడ-మచిలీపట్నం, కాకినాడ పోర్ట్-విజయవాడ మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. బిలాస్‌పూర్ తిరుపతి, కాకినాడ పోర్ట్-చెంగల్పట్టు రైళ్లను నిడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా దారిమళ్లించారు. అసనీ అతి తీవ్ర తుఫాన్ గా మారడంతో ఏపీలోని తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.