అమరావతిలో నిర్మాణ పనులు పునఃప్రారంభం?
పైకి మూడు రాజధానులే మా విధానం అంటున్నా హైకోర్టు తీర్పు ప్రభావంతో జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించింది . అమరావతి ప్రాంతంలో ఆగిపోయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనులు పునః ప్రారంభం కానున్నాయి. నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ తమ నిర్మాణ సామగ్రి మరియు యంత్రాలను ప్రాజెక్ట్ స్థలంలో డంప్ చేయడం ప్రారంభించింది. కార్మికులు కూడా నెమ్మదిగా వచ్చి చేరుకుంటున్నారు. వారు త్వరలో పని ప్రారంభిస్తారని అంటున్నారు. కాగా, కంపెనీ ప్రతినిధులు, కార్మికులకు రైతులు స్వాగతం పలికారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ పథకంలో రాజధాని కోసం 33 వేల మందికి పైగా రైతులు భూములు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రణాళికలను రూపొందించిన తర్వాత అవి అన్నీ ఎండిపోయాయి. 800 రోజులకు పైగా ఆందోళనలు చేసిన తరువాత హైకోర్టు రాజధాని పనులు 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అనుకూల తీర్పు వెలువరించింది. రాజకీయంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ టెక్నికల్ గా పూర్తి చేసేందుకు 60 నెలల సమయం కావాలని కోరింది. అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించ లేదు సరి కదా మూడు రాజధానులకు కొత్త బిల్లులను ప్రవేశపెట్టలేదు.